Share News

State Budget: 19న రాష్ట్ర బడ్జెట్‌?

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:14 AM

తొలి రోజు బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగం ఉంటుంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన వివరిస్తారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడుతుంది.

State Budget: 19న రాష్ట్ర బడ్జెట్‌?

నేటి నుంచి శాసన సభా సమావేశాలు

  • 11 గంటలకు గవర్నర్‌ ప్రసంగం

  • తర్వాత బీఏసీ భేటీ.. సభ తేదీల ఖరారు

  • ఈసారి సమావేశాలకు కేసీఆర్‌ హాజరు

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి శాసనసభ, మండలి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ సమావేశాలకు హాజరు కావడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు, ప్రాజెక్టుల అంశంపై బీజేపీ, అధికారపార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండడం, దక్షిణాది రాష్ట్రాలకు నిధుల విడుదల, పార్లమెంటు నియోజక వర్గాల డీ లిమిటేషన్‌పై చర్చ సాగుతుండడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈసారి సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతాయని అంటున్నారు. తొలి రోజు బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగం ఉంటుంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన వివరిస్తారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడుతుంది. తర్వాత స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సమక్షంలో జరిగే ‘శాసన సభా వ్యవహారాల కమిటీ(బీఏసీ)’ భేటీలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేస్తారు. 13న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 14న హోలీ పండుగ కావడంతో సభకు సెలవు ప్రకటించే అవకాశముంది. 15న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం. ఆ రోజు రెండు వర్గాలకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెడతారా లేదా ఒక వర్గానికి సంబంధించిన బిల్లును మాత్రమే పెడతారా అనేది బీఏసీలో తేలుస్తారు. ఒకవేళ 15న బిల్లులను ప్రవేశపెట్టకపోతే... 16న ఆదివారం సభకు సెలవు ఇచ్చి, 17, 18 తేదీల్లో బిల్లులను ప్రవేశపెట్టడం, చర్చించడం పూర్తి చేస్తారు. 19న మాత్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెడతారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బడ్జెట్‌ను సభ్యులు చదువుకోవడానికి వీలుగా 20న సెలవు ఇస్తారు. 21 నుంచి బడ్జెట్‌పై చర్చను చేపడతారు. సమావేశాలను ఈ నెలాఖరు వరకు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ దృష్ట్యా... అప్పటి వరకు బడ్జెట్‌పై, బడ్జెట్‌ పద్దులపై చర్చను చేపట్టి, చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును సభలో ఆమోదిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశాలు పూర్తి అయిన అనంతరమే బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.


డీలిమిటేషన్‌పై తీర్మానం ?

పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై ఈ సమావేశాల్లోనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలన్నది సర్కారు ఆలోచన. . 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్లను పెంచాలనుకుంటే... తాము నష్టపోతామని, అందుకే.... 1971 జనాభాల లెక్కలను ఆధారంగా చేసుకుని పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్ర వాదనను వివరిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.


ఈసారి కేసీఆర్‌ హాజరు

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, శాసన సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఈసారి సమావేశాలకు హాజరు కానున్నారు. 2023 డిసెంబరులో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహించిన శాసన సభా సమావేశాల్లో ఒక్క రోజు మాత్రమే కేసీఆర్‌ పాల్గొన్నారు. 2024 జూలైలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజు ఆయన సభకు వచ్చి వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు హాజరవుతున్నారు. అయితే, రెండు ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఆయన సభకు హాజరవుతారని సమాచారం. గవర్నర్‌ ప్రసంగం ఉన్న బుధవారం, బడ్జెట్‌ను ప్రవేశపెట్టే 19వ తేదీన ఆయన సభకు వస్తారని సమాచారం. మిగతా రోజుల్లో సభకు వస్తే గవర్నర్‌ ప్రసంగంపైనో, బడ్జెట్‌పైనో, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులపైనో మాట్లాడాలన్న డిమాండ్లు ఉంటాయి. ఇలాంటివాటికి దూరంగా ఉండాలంటే... 12, 19 తేదీల్లో మాత్రమే సమావేశాలకు హాజరవుతారన్న చర్చ జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు

Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..

Updated Date - Mar 12 , 2025 | 04:14 AM