పోడు రైతులకు.. ఇందిర సౌర గిరి జల వికాసం
ABN , Publish Date - May 16 , 2025 | 03:15 AM
పోడు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలు చేయనుంది.
18న అమ్రాబాద్‌లో ప్రారంభించనున్న సీఎం రేవంత్
పోడు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలు చేయనుంది. ఈ పథకం కోసం వచ్చే ఐదేళ్లలో(2025-26 నుంచి 2029-30) రూ.12,600 కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత సంవత్సరం(2025-26)లో రూ.600 కోట్ల ను ఖర్చు చేయనుండగా, తదుపరి నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.3వేల కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. పథకం అమలుకు ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులను వినియోగించనున్నారు.
ఈ మేరకు ఈ పథకం అమలుకు అనుమతులిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో-15) జారీ చేసింది. ఈ పథకం కింద పోడు పట్టాలు పొందిన భూముల్లో బోర్లు వేయడం, వాటికి సోలార్ పంపు సెట్లు అందించడం సహా మౌలిక సౌకర్యాలను కల్పిస్తారు. 100ు రాయితీతో ఈ పథకాన్ని గిరిజనులకు అందించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మాచారంలో పథకాన్ని ప్రారంభించనున్నారు.