Share News

కిశోర బాలికల్లో రక్తహీనతకు చెక్‌!

ABN , Publish Date - May 26 , 2025 | 04:16 AM

రాష్ట్రంలోని కిశోర బాలికల్లో రక్తహీనతను తగ్గించడంతోపాటు వారు వయసుకు తగ్గ బరువు పెరిగేందుకు దోహదపడే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.

కిశోర బాలికల్లో రక్తహీనతకు చెక్‌!

  • వారికి పల్లీ, చిరుధాన్యాల పట్టీల అందజేత

  • ఇప్పటికే ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కిశోర బాలికల్లో రక్తహీనతను తగ్గించడంతోపాటు వారు వయసుకు తగ్గ బరువు పెరిగేందుకు దోహదపడే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందులో భాగంగా వేసవి సెలవులు ముగిశాక కిశోర బాలికలకు పల్లీలు, చిరుధాన్యాలతో తయారు చేసిన పట్టీలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ద్వారా కుమురంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అక్కడి ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.. 14-18 ఏళ్ల వయసున్న కిశోర బాలికలు పోషకాహారలోపం వల్ల రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే వయసుకుతగ్గట్టుగా వారిలో ఎదుగుదల ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కిశోర బాలికల ఆరోగ్యం, పోషకాహార స్థితిని మెరుగుపరిచేందుకు 600 క్యాలరీల శక్తి, 18-20 గ్రాముల ప్రొటీన్‌ కలిగిన చిరుధాన్యాలతో పోషకాహారం అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బడి బయట కిశోర బాలికలకు పల్లీలు, చిరుధాన్యాల పట్టీలు అందించడానికి ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది.


రాగులు, సజ్జలు, కొర్రలు, అరికెలు, వరిగలు, సామలు వంటి చిరుధాన్యాలతో అనేక ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉండటంతో వాటితో తయారు చేసిన పట్టీలను అందజేస్తారు. వీటి తయారీ, నిల్వలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పరిశీలనకు కమిటీ ఇదివరకే ఏర్పాటైంది. మూడు జిల్లాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా పథకం అమలు చేస్తున్నారు. ఇక్కడ అనుకూల, ప్రతికూల అంశాలపై కమిటీ మరోసారి పరిశీలన చేయనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పోషకాహార లోపం కలిగిన కిశోర బాలికలను గుర్తించి అవగాహన కల్పిస్తారు. వారిలో అతి తక్కువ బరువు, వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, రక్తహీనతకు గల కారణాలు గుర్తిస్తారు. వాటిని మెరుగుపరిచేందుకు పోషకాహారంతో కూడిన పదార్థాలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తారు. అంతేకాకుండా వ్యక్తిగత శుభ్రత, లింగ వివక్షత, బాల్యవివాహాలు, బాలికల సంరక్షణ వంటి చట్టాలపైనా అవగాహన కల్పిస్తారు. ఇక వేసవి సెలవుల తర్వాత అంగన్‌వాడీ కేంద్రాల్లో పల్లీ, చిరుధాన్యాల పట్టీలు అందజేయనున్నట్టు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అఽధికారి ఒకరు తెలిపారు.

Updated Date - May 26 , 2025 | 04:16 AM