Share News

BC Reservation: 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు!

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:39 AM

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని, అది కూడా చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులు నాలుగు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండిగ్‌లో ఉన్నాయి.

BC Reservation: 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు!

  • రాష్ట్రపతి, గవర్నర్‌ వద్ద బిల్లుల పెండింగ్‌ అంశాన్ని వివరిస్తూ కోర్టును సమయం కోరనున్న సర్కారు

  • చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించేందుకే.. మొగ్గు

  • కోర్టు అంగీకరిస్తే నవంబర్‌లో ఎన్నికల నిర్వహణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని, అది కూడా చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులు నాలుగు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండిగ్‌లో ఉన్నాయి. ఇటీవల పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ చట్టాలను సవరిస్తూ మరో రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించి, గవర్నర్‌కు పంపగా.. అవీ పెండింగ్‌లో ఉన్నాయి. చట్టబద్ధంగా రిజర్వేషన్‌ కల్పించాలంటే రాష్ట్రపతి, గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఎవరో ఒకరి వద్ద ఆమోద ముద్ర పడాల్సిందే. వాస్తవానికి బిల్లులకు ఆమోదముద్ర పడకుంటే.. నేరుగా జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. కానీ, ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ జీవోను కొట్టివేసే అవకాశాలున్నాయి.


ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదం కోసం మరికొంత కాలం వేచి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబరు 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. బీసీలకు రిజర్వేషన్ల కల్పన కోసం తాము ఏం చేశామన్నది వివరిస్తూ కొంత సమయం కోరాలని సర్కారు యోచిస్తోంది. ఎంత గడువు కోరదామనే అంశంపైనా తర్జనభర్జన నడుస్తోంది. రెండు లేదా మూడు నెలల సమయం ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరిస్తే.. ఎన్నికలు నవంబర్‌ నెలలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Updated Date - Sep 09 , 2025 | 04:39 AM