Bhatkamma Festival: 9 రోజులు.. 9 వేడుకలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:49 AM
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు తార్కాణమైన బతుకమ్మ పండుగను ఈసారి వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 9 రోజుల పాటు 9 రకాల వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈసారి బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. రామప్పలో ప్రారంభోత్సవం
హుస్సేన్‌సాగర్‌లో ‘ఫ్లోటింగ్ బతుకమ్మ’ కార్యక్రమం
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు తార్కాణమైన బతుకమ్మ పండుగను ఈసారి వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 9 రోజుల పాటు 9 రకాల వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పర్యాటక శాఖ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దానికి తుదిరూపు ఇచ్చాక మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రకటించనున్నారు. బతుకమ్మ పండుగను తొలిరోజున రామప్పలో ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ‘ఫ్లోటింగ్ బతుకమ్మ’ పేరుతో ఓ కొత్త కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈసారి వేడుకల్లో సెలబ్రిటీలతోపాటు అంతర్జాతీయ ప్రముఖులను కూడా భాగస్వామ్యం చేయాలని.. తద్వారా బతుకమ్మ పండుగ ఆయా దేశాల్లోనూ చర్చకు వస్తుందని పర్యాటక శాఖ భావిస్తున్నట్టు సమాచారం. ఇక హైదరాబాద్‌లో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారిని కూడా బతుకమ్మ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు బతుకమ్మ నేపథ్యంలో ఇంటర్, డిగ్రీ కాలేజీల విద్యార్ధులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి, గ్రేడ్‌ల వారీగా బహుమతులు అందజేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
గురుకులాల్లో నిలిచిపోయిన టెండర్లు!
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు అవసరమయ్యే నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ వంటి వాటి సేకరణకు ప్రభుత్వం ఆహ్వానించిన ఈ-టెండర్లు నిలిచిపోయాయి. ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్ల నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.17ను రద్దు చేయాలని కోరుతూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తాత్కాలికంగా ఈ-టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ తరుణంలో కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయ్యే వరకు పాత కాంట్రాక్టర్లే సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారు.