బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:35 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుపై ఎలా ముందుకెళ్లాలన్న విషయంలో సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. నెల రోజుల్లోనే రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలని హైకోర్టు ఆదేశించడంతో..
నెలలోనే ఖరారు చేయాలంటే ఇదొక్కటే దారి?
సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
న్యాయ నిపుణులతో సమాలోచనలు
ఇప్పటికే ప్రభుత్వానికి కమిషన్ ఆరు నివేదికలు
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుపై ఎలా ముందుకెళ్లాలన్న విషయంలో సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. నెల రోజుల్లోనే రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలని హైకోర్టు ఆదేశించడంతో.. ఏం చేయాలనేదానిపై సమాలోచనలు చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ ఓవైపు.. న్యాయ పరిమితులు మరోవైపు సర్కారును ఇరకాటంలో పడేశాయి. 90 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆదేశించిన హైకోర్టు.. నెల రోజుల్లోనే రిజర్వేషన్లను ఖరారు చేయాలని కూడా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం కేవలం నెల రోజుల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించడం దాదాపు అసాధ్యమే! జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ల ఖరారుకు ఉన్న సమయం జూలై 24 వరకే! కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా.. బిల్లు ఆమోదం ఎంతవరకు సాధ్యమవుతుందనేది ప్రశ్నార్థకమే. అందుకే కేంద్రంపై ఒత్తిడిని కొనసాగిస్తూనే.. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవో జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటోంది. జీవో ఇస్తే చెల్లుబాటు అవుతుందా? న్యాయపరమైన చిక్కులేమైనా వస్తాయా? అనేదానిపై ఆరా తీస్తోంది. ఒకవేళ జీవో ఇవ్వడం కుదరకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఏదేమైనా రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియను వారంలోపే ప్రారంభించాలి. అప్పుడే నెల రోజుల్లో పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
6 రకాల నివేదికలు..
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలవగా, బీసీలకు సుమారు 23 శాతం అమలయ్యాయి. గత ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది. అందులో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గించింది. ఆ విధానంలోనే 2019లో స్థానిక ఎన్నికలను నిర్వహించింది. అయితే బీసీలకు రిజర్వేషన్లను తగ్గించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అప్పటి నుంచి స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాల విచక్షణ మేరకు 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి మించకుండా కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక కమిషన్‌ను నియమించింది. కుల సర్వేలో రాష్ట్రంలో బీసీల జనాభా 56.33ు (ఓసీ ముస్లింలు, బీసీ ముస్లింలు కలిపి) ఉన్నారని తేలింది.
ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల సిఫారసులను ప్రత్యేక కమిషన్ 6 కేటగిరీలుగా విభజించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్.. ఇలా 6 ర కాల నివేదికలను తయారు చేసింది. ఆయా పదవుల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల వివరాలను నివేదికలో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రకారం, బీసీలకు 2024లో నిర్వహించిన కులసర్వే లెక్కల ప్రకారం వివరాలను క్రోడీకరించి రిజర్వేషన్లపై సిఫారసు చేశారు. ప్రత్యేక కమిషన్ నివేదిక సుప్రీంకోర్టు సూచించిన ‘ట్రిపుల్ టీ’ నిబంధనలకు లోబడే ఉంది. ఓవైపు రిజర్వేషన్లు 50ు మించకూడదన్న సుప్రీం తీర్పు, మరోవైపు సెప్టెంబరు 30లోపు స్థానిక ఎన్నికలు ముగించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.