Share News

High Court: యూజీసీ నిబంధనలపై రాష్ట్ర సర్కారు వ్యాజ్యం

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:10 AM

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జారీ చేసిన నూతన నిబంధనలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. నూతన నిబంధనల ప్రకారం అనుమతి పొందిన డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీలు భవిష్యత్తులో మూతపడితే ఆ బాధ్యత ఎవరు వహిస్తారని, విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు జవాబుదారీగా ఉంటారని ప్రశ్నించింది.

High Court: యూజీసీ నిబంధనలపై రాష్ట్ర సర్కారు వ్యాజ్యం

  • డీమ్డ్‌ వర్సిటీల్లో మా పాత్ర లేకుండా చేశారు

  • వాటిని మూసేస్తే ఎవరిది బాధ్యత?

  • విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు జవాబుదారీ?

  • పిటిషన్‌లో ప్రశ్నించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, యూజీసీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జారీ చేసిన నూతన నిబంధనలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. నూతన నిబంధనల ప్రకారం అనుమతి పొందిన డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీలు భవిష్యత్తులో మూతపడితే ఆ బాధ్యత ఎవరు వహిస్తారని, విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు జవాబుదారీగా ఉంటారని ప్రశ్నించింది. యూజీసీ ఇన్‌స్టిట్యూషన్స్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీస్‌ రెగ్యులేషన్స్‌ - 2023లోని 2 (15), 6, 7, 8, 29, 30 తదితర నిబంధనలను కొట్టివేయాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, యూజీసీతోపాటు ప్రైవేటు డీమ్డ్‌ యూనివర్సిటీలైన అరోరా హయర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ అకాడమీ, చైతన్య డీమ్డ్‌ యూనివర్సిటీ, కేఎల్‌ యూనివర్సిటీ, కేఎల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ క్యాంపస్‌, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్‌, సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ తదితర యూనివర్సిటీలను ప్రతివాదులుగా చేర్చారు.


ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. డీమ్డ్‌ యూనివర్సిటీలు, వాటి ఆఫ్‌ క్యాంప్‌సల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో చిన్న చిన్న దుకాణాలు, షెడ్లలో కూడా కాలేజీలు నడిపించారని, వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్రం, యూజీసీలకు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది.

Updated Date - Mar 18 , 2025 | 04:10 AM