Thummala: రెండ్రోజుల్లో రాష్ట్రానికి 21,325 టన్నుల యూరియా!
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:03 AM
యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండ్రోజుల్లో రాష్ట్రానికి 21,325 టన్నుల యూరియా వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
అదనపు కోటా కోసం కేంద్రానికి లేఖ
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండ్రోజుల్లో రాష్ట్రానికి 21,325 టన్నుల యూరియా వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వివిధ కంపెనీల నుంచి రాష్ట్రానికి వచ్చే యూరియా రైల్వే రేక్ పాయింట్లు అయిన గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్‌నగర్, జడ్చర్ల, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వేల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లి ప్రాంతాలకు చేరుకుంటుందని తెలిపారు. అక్కడి నుంచి డిమాండ్ ఉన్న జిల్లాలకు యూరియా తరలిస్తామని వెల్లడించారు. అలాగే, సెప్టెంబరు మొదటి వారంలోపు వివిధ పోర్టుల ద్వారా మరో 27,950 టన్నుల యూరియా వస్తుందన్నారు. ఇక, రైతుల అవసరాలు తీర్చేందుకు సెప్టెంబరులో రాష్ట్రానికి అదనపు యూరియా కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర మంత్రి తుమ్మల శుక్రవారం లేఖ రాశారు.
రాష్ట్రంలో వరి పంటకు మొదటి, రెండో విడతల యూరియా వేస్తున్నారని, త్వరలో మూడో విడతతో పాటు కాంప్లెక్స్ ఎరువుల వాడకం కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం వరి పంటకే సెప్టెంబరు నెలలో 2.81 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని వివరించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రానికి 2.38 లక్షల టన్నుల లోటు ఏర్పడిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30వేల టన్నుల యూరియా ఉందని, రోజుకు 9 వేల నుంచి 11 వేల టన్నుల వరకు అమ్మకాలవుతున్నాయనిపేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అదనంగా 2.38 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కోరారు. సెప్టెంబరు నెలకు ఇప్పటికే ఆమోదించిన 1.50 లక్షల టన్నుల సరఫరాకు తోడుగా ఈ అదనపు కేటాయింపును మంజూరు చేయాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.