Seat Allotment: రైతుల పిల్లలకు25%.. రైతు కూలీల పిల్లలకు 15%!
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:32 AM
ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు డిగ్రీ కోర్సుల సీట్ల కేటాయింపుల్లో అధికారులు కొన్ని మార్పులు చేశారు.
అగ్రికల్చర్ బీఎస్సీ సీట్ల కోటాలో మార్పులు
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు డిగ్రీ కోర్సుల సీట్ల కేటాయింపుల్లో అధికారులు కొన్ని మార్పులు చేశారు. గతంలో రైతు కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉన్న 40 శాతం ప్రత్యేక కోటాను విభజించారు. ఇప్పుడు రైతుల పిల్లలకు 25 శాతం, రైతు కూలీల పిల్లలకు 15 శాతం కోటాను కేటాయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నిబంధనను అమలుచేస్తూ అడ్మిషన్లు ఇస్తున్నారు.
గతంలో ఉన్న నిబంధన ప్రకారం బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ఉన్న మొత్తం సీట్లలో 40శాతం సీట్లను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపాదికన రైతు కుటుంబాలకు ఇచ్చేవారు. ప్రస్తుతం రైతు కుటుంబాలకు కేటాయించిన 25 శాతం కోటాలో, వ్యవసాయ కూలీలకు కేటాయించిన 15 శాతం కోటాలో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటిస్తారు. ఈ కోటాలో సీట్లు పొందే విద్యార్థులు 4-12వ తరగతి వరకు కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలనే నిబంధన పెట్టారు.