Share News

Film City: సినిమా సిటీకి.. 2,000 ఎకరాలు ఇవ్వండి

ABN , Publish Date - Jan 01 , 2025 | 03:42 AM

‘హైదరాబాద్‌లో సినిమా సిటీ ఏర్పాటు చేస్తాం. అందుకు 1500-2000 ఎకరాల భూమిని కేటాయించండి’ అంటూ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆప్‌ కామర్స్‌ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Film City: సినిమా సిటీకి.. 2,000 ఎకరాలు ఇవ్వండి

పారదర్శకతకు ‘ఆన్‌లైన్‌ టికెట్‌’ అమలు చేయాలి

అటవీ ప్రాంతాల్లో షూటింగ్‌ చార్జీలను తగ్గించాలి

ఆఫీసులు, బస్టాండ్లలో షూటింగ్‌కు అనుమతినివ్వండి

రూ.4 కోట్ల పెండింగ్‌ రాయితీని విడుదల చేయండి

ఎఫ్‌డీసీకి ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ విజ్ఞప్తి

రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్న ఎఫ్‌డీసీ

హైదరాబాద్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్‌లో సినిమా సిటీ ఏర్పాటు చేస్తాం. అందుకు 1500-2000 ఎకరాల భూమిని కేటాయించండి’ అంటూ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆప్‌ కామర్స్‌ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు పలు వినతులతో కూడిన లేఖను అందించారు. గత ప్రభుత్వం 2020లో హైదరాబాద్‌లో సినిమా సిటీ ఏర్పాటు కోసం భూములను ఇస్తామని ప్రకటించింది. ఆ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణం, అత్యుత్తమ సౌకర్యాలను కూడా కల్పిస్తామని చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వం కేటాయించే భూముల్లో మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తుందని, విమానాలు తిరిగేలా ఒక ఎయిర్‌స్ట్రి్‌పను కూడా నిర్మించేలా ప్రతిపాదించింది. కానీ, ఇప్పటివరకూ ఏదీ ముందుకుపడలేదు. ఇదే అంశాన్ని ప్రధానంగా సినీ పరిశ్రమ ఎఫ్‌డీసీ ముందుంచింది. ప్రస్తుత ప్రభుత్వం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 24 కి.మీ. పరిధిలో ఎక్కడైనా సినిమా సిటీ నిర్మాణానికి భూములను కేటాయించాలని కోరింది. ఇక, టికెట్ల పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. పెద్ద సినిమాల విడుదల సమయంలో బ్లాక్‌ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. దీనికి చరమగీతం పాడేలా ‘ఆన్‌లైన్‌ టికెటింగ్‌’ వ్యవస్థను ప్రవేశపెట్టాలని పరిశ్రమ ప్రతిపాదించింది. ఈ ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని దశల వారీగా అమలుచేయాలని, వీటిలో జిల్లా కేంద్రాలు, మునిసిపాలిటీ పరిధిల్లో మొదటి విడత కింద, గ్రామపంచాయతీల్లో రెండో విడత కింద అమలు చేయాలని సూచించింది. అదే విధంగా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ ప్లాట్‌ఫాంలో ఉన్న పలు కంపెనీలు సినిమాలను ప్రదర్శించేందుకు అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయని, వాటిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పరిధిలోనే ఒక డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందని సూచించింది. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంతో పాటు, ఈ సర్వీస్‌ ప్రొవైడర్‌లను ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకొస్తే నిర్మాతలకు భారీ ఉపశమనం కలుగుతుందని వివరించారు. ఇక జాయింట్‌ వెంచర్‌ డిజిటల్‌ సినిమా టెక్నాలజీ విధానాన్ని అందుబాటులోకి తీసుకు రావడానికి కూడా ప్రభుత్వం అనుమతినివ్వాలని కోరారు.


లొకేషన్‌ చార్జీలను తగ్గించండి

సినిమా షూటింగ్‌లకు అవసరమైన అనుమతులను సింగిల్‌ విండో విధానంలో ఇవ్వాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. అటవీ శాఖ పరిధిలోని ఏదైనా ప్రాంతాల్లో షూటింగ్‌ చేసేందుకు రోజుకు రూ.50వేలు తీసుకుంటున్నారని, ఇది చాలా భారంగా ఉందని, ప్రభుత్వం దృష్టి సారించి ఈ ధరలను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌, రోడ్లు, పార్కులు, బ్రిడ్జిలు, బస్‌స్టేషన్లు, ఎంఎంటీఎస్‌ సహా వివిధ ప్రభుత్వ స్థలాల్లో షూటింగ్‌కు అనుమతినివ్వాలని కోరారు. పర్యాటక ప్రాంతాల్లో షూటింగ్‌లకు ఉచితంగా అవకాశం కల్పించాలని, దాంతో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఇది దోహదపడుతుందన్నారు. ఇక పోలీస్‌ శాఖ, జీహెచ్‌ఎంసీ అనుమతులను ఒకేసారి సింగిల్‌విండో కింద ఇవ్వాలని కోరారు.

చిన్న సినిమాలకు రాయితీ ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం చిన్న సినిమాలను ఇన్సెంటివ్‌లు, రాయితీలను అందించాలని కూడా పరిశ్రమ కోరింది. దీనివలన ఎంతోమంది కొత్త వారికి అవకాశం లభిస్తుందన్నారు. ఇక దాదాపు 41 తక్కువ బడ్జెట్‌ సినిమాలతో పాటు, 7పిల్లల చిత్రాలు ప్రభుత్వ రాయితీ కోసం ఎదురుచూస్తున్నాయని, వీటన్నింటికీ కలిపి రూ.4 కోట్ల వరకు రాయితీ ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరితగతిన రాయితీని అందించాలని కోరారు. వీటితో పాటు బీ-ఫామ్‌ లైసెన్స్‌ల విషయంలో ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, పోలీసు శాఖ, ఆర్‌ అండ్‌ బీ శాఖలు సహకరించాలని, లైసెన్స్‌ల రెన్యువల్స్‌ విషయంలో కొంత సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గదర్‌ (గద్దర్‌) అవార్డుల అమలుకు కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్‌డీసీ త్వరలోనే ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి లేఖను అందించనుంది.

Updated Date - Jan 01 , 2025 | 03:42 AM