Share News

Future City: ఫ్యూచర్‌సిటీ దిశగా వడివడిగా..

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:35 AM

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు అదనంగా అధునాతనమైన హంగులతో నాలుగో నగరాన్ని నిర్మించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ ఆథారిటీ (ఎఫ్‌సీడీఏ) సేవలు వారం రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Future City: ఫ్యూచర్‌సిటీ దిశగా వడివడిగా..

  • వారంలో అందుబాటులోకి డెవల్‌పమెంట్‌ అథారిటీ సేవలు

  • నానక్‌రాంగూడ నుంచి కార్యకలాపాలు.. 36మంది అధికారులు, సిబ్బంది కేటాయింపు

  • హెచ్‌ఎండీఏ నిబంధనలన్నీ ఎఫ్‌సీడీఏకు వర్తింపు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు అదనంగా అధునాతనమైన హంగులతో నాలుగో నగరాన్ని నిర్మించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ ఆథారిటీ (ఎఫ్‌సీడీఏ) సేవలు వారం రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఎఫ్‌సీడీఏకు సంబంధించిన అధికారులు, సిబ్బంది నియమకాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. నానక్‌రాంగూడలోని హెచ్‌ఎండీఏకు చెందిన ‘హైదరాబాద్‌ గ్రోథ్‌ కారిడార్‌ లిమిటెడ్‌’ కార్యాలయంలోనే ఎఫ్‌సీడీఏ ఆఫీసు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్‌, ఇబ్రహీంపట్నం, కడ్తాల్‌, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల్లోని 56 గ్రామాల పరిధిలో ఉన్న 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎఫ్‌సీడీఏ పని చేయనుంది. ఫ్యూచర్‌ సిటీలో హెచ్‌ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలు, డైరెక్టర్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) పరిధిలోని 20 గ్రామాలు ఉంటాయి. ఎఫ్‌సీడీఏకి ముఖ్యమంత్రి చైౖర్మన్‌గా, మున్సిపల్‌ శాఖ మంత్రి వైస్‌ చైౖర్మన్‌గా ఉండగా.. పలు శాఖల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను సభ్యులుగా నియమించారు. 36 మంది అధికారులు, సిబ్బంది పోస్టులను కూడా ఎఫ్‌సీడీఏకు మంజూరు చేశారు. ఎఫ్‌సీడీఏ కమిషనర్‌గా ఇప్పటికే ఐఏఎస్‌ అధికారి శశాంక్‌ను నియమించగా.. ప్లానింగ్‌ అదనపు డైరెక్టర్‌గా డీటీసీసీ డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎఫ్‌సీడీఏలో ప్లానింగ్‌ విభాగాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. చీఫ్‌ ఇంజనీర్‌గా, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా హెచ్‌జీసీఎల్‌ ఇంజనీర్లను నియమించే అవకాశాలున్నాయి.


సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ప్రక్రియ

ఎఫ్‌సీడీఏ పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యేంత వరకు ప్యూచర్‌ సిటీలో నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులు ఇచ్చే బాధ్యతను హెచ్‌ఎండీఏ, డీటీసీపీలకు అప్పగించారు. ఎఫ్‌సీడీఏ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అనుమతులు ఎఫ్‌సీడీఏ ద్వారానే జారీ కానున్నాయి. ఈ మేరకు ఎఫ్‌సీడీఏ పరిధిలోని గ్రామాల్లో భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులకు బిల్డ్‌నౌలో దరఖాస్తు చేయగానే ఆథారిటీకి వెళ్ళేవిధంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసే ప్రక్రియ నడుస్తోంది. హెచ్‌ఎండీఏలో ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ అవతలి ప్రాంతాలకు అనుమతుల కోసం ఏ నిబంధనలు ఉన్నాయో.. వాటినే ఎఫ్‌సీడీఏకు వర్తించే విధంగా ఇటీవల చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

Updated Date - Aug 07 , 2025 | 04:35 AM