Share News

Ranga Reddy: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి

ABN , Publish Date - Mar 06 , 2025 | 06:03 AM

ఓ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్న అతడు.. అక్కడికి వచ్చిన దుండగులను అడ్డుకోబోగా వారు కాల్పులు జరిపి పారిపోయారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు-రమ దంపతుల కుమారుడు ప్రవీణ్‌(27) ఎంఎస్‌ చేయడానికి 2023లో అమెరికా వెళ్లాడు.

Ranga Reddy: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి

కేశంపేట, ఫిబ్రవరి 5: (ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన రంగారెడ్డి జిల్లా యువకుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు. ఓ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్న అతడు.. అక్కడికి వచ్చిన దుండగులను అడ్డుకోబోగా వారు కాల్పులు జరిపి పారిపోయారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు-రమ దంపతుల కుమారుడు ప్రవీణ్‌(27) ఎంఎస్‌ చేయడానికి 2023లో అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ మిల్వాకీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఒక స్టోర్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్‌.. మంగళవారం విధులు నిర్వర్తిస్తుండగా కొందరు దుండగులు అందులోకి ప్రవేశించారు. వారిని అడ్డగించడానికి ప్రవీణ్‌ ప్రయత్నించగా తుపాకులతో కాల్పులు జరిపారు. గాయపడిన ప్రవీణ్‌ను మిల్వాకీ పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు ప్రవీణ్‌ తల్లిదండ్రులకు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు. 3 నెలల్లో ఎంఎస్‌ పూర్తి చేసుకుని ప్రవీణ్‌ రావాల్సి ఉందని.. ఇంతలోనే దారుణం జరిగిపోయిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

Updated Date - Mar 06 , 2025 | 06:03 AM