Share News

Telangana Unveils Mega Tourism: 15 వేల కోట్ల పెట్టుబడులు50 వేల ఉద్యోగాలు

ABN , Publish Date - Sep 27 , 2025 | 03:38 AM

రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు అద్భుతమైన అనుభూతి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది...

Telangana Unveils Mega Tourism: 15 వేల కోట్ల పెట్టుబడులు50 వేల ఉద్యోగాలు

  • ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శిల్పారామంలో నేడు టూరిజం కాంక్లేవ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు అద్భుతమైన అనుభూతి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పలు నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని శిల్పారామం వేదికగా శనివారం నిర్వహించే తెలంగాణ టూరిజం కాంక్లేవ్‌-2025లో వాటిని ఆవిష్కరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటకాభివృద్థి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. తెలంగాణ సర్కారు పర్యాటక విధానాన్ని అధ్యయనం చేసిన పలువురు పెట్టుబడిదారులు.. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన హోటళ్లు, వెల్‌నెస్‌ సెంటర్లు, హాస్పిటాలిటీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందులో అనంతగిరి కొండల్లో జెసోమ్‌ అండ్‌ జెన్‌మేఘా సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అత్యాధునిక వెల్‌నె్‌ససెంటర్‌, ద్రాక్ష పంట నుంచి వైన్‌ తయారీ యూనిట్‌, అటవీ ప్రాంతంలో తాజ్‌సఫారీ, మహేంద్ర కంపెనీ ఆధ్వర్యంలో వాటర్‌ ఫ్రంట్‌ రిసార్ట్స్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో జింజర్‌ హోటళ్ల వంటి ప్రాజెక్టులున్నాయి. నాగార్జున సాగర్‌లో వెల్‌నెస్‌ రిట్రీట్‌.. వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ సెంటర్‌గా బుద్థవనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తైవాన్‌కు చెందిన ఫో గంగ్‌షాన్‌ సంస్థ సిద్దంగా ఉంది. సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో టూరిజం కాంక్లేవ్‌లో ఈ సంస్థలు ఆయా పనులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఫలితంగా పరోక్షంగా సుమారు 50వేల మందికి ఉపాధి లభించనుంది.


అంతర్జాతీయ చిత్ర నగరంగా ....

ప్రపంచ స్థాయి చిత్రాల నిర్మాణ కేంద్రంగా ఇప్పటికే హైదరాబాద్‌కు గుర్తింపు లభించింది. దాన్ని మరింతగా అభివృద్థిచేసి ప్రపంచ చిత్ర పరిశ్రమకు మరింత ేస్నహపూరిత వాతావరణం కల్పించి అత్యధిక చిత్రాలు ఇక్కడే నిర్మించేలా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా శనివారం ఫిలిం ఇన్‌ తెలంగాణ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్‌ ద్వారా సినిమా నిర్మాణాలకు సంబంధించి సింగిల్‌ విండో అనుమతులు ఇస్తారు. ఇక.. చౌక ధరల్లో మెరుగైన వైద్య సదుపాయం అందుబాటులో ఉండడంతో ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో పేషెంట్లు వైద్యం కోసం హైదరాబాద్‌ ఆసుపత్రులకు వస్తున్నారు. అలా వచ్చేవారికి వీలుగా రాష్ట్ర సర్కారు ‘తెలంగాణ మెడికల్‌ వాల్యూ టూరిజం (ఎంవీటీ)’ పోర్టల్‌ను ప్రారంభించనుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రులు, స్పెషాలిటీలు, ప్రముఖ వైద్యులు, బీమా సౌకర్యాలు, వీసా సంబంధిత వివరాలు ఈ పోర్టల్‌లో ఉంటాయి.

హెలికాప్టర్‌ విహారం.. డబుల్‌డెకర్‌ బోటు..

పర్యాటకులు సరికొత్త అనుభూతి చెందేందుకు హెలికాప్టర్‌ టూరిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా తొలుత హైదరాబాద్‌ నుంచి సోమశిల.. అక్కడి నుంచి శ్రీశైలం వరకు హెలికాప్టర్‌ ేసవలు ప్రారంభిస్తారు. అలాగే.. నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి భద్రాచలం వరకు సీ ప్లేన్‌ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జల విహారాల ప్రోత్సాహంలో భాగంగా హుస్సేన్‌ సాగర్‌లో 120 సీట్ల సామర్థ్యమున్న డబుల్‌ డెకర్‌ బోట్‌ను ప్రారంభించనుంది. ఒకప్పుడు హైదరాబాద్‌కు జీవనాడిగా ఉన్న మూసీనది అసలు పేరు ముచుకుందానది. అందుకే ఆ నది పేరును ఈ బోట్‌కు పెట్టారు. వీటితోపాటు.. తెలంగాణ రుచులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు నెదర్లాండ్స్‌ ప్రభుత్వంతో మన ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. ఇక.. తెలంగాణను సందర్శించే పర్యాటకులకు భద్రత కల్పించేందుకు టూరిస్టు పోలీసుల సంఖ్యను 15నుంచి 90కి పెంచాలని నిర్ణయించారు. తెలంగాణలోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు వెళ్లేవారు రైళ్లు, బస్సులు, అవసరమైన వాహనాల్లో సాఫీగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ, ఇతర ట్రావెలింగ్‌ సంస్థలతో టూరిజం శాఖ ఒప్పందం చేసుకోనుంది. అలాగే డిజిటల్‌ టూరిజం కార్డ్‌ను అందుబాటులో తేనుంది. ఈ కార్డు ద్వారా రాష్ట్రంలోని వివిధ ఆలయాలు, రవాణా వాహనాలు, హోటళ్లలో రాయితీలు లభిస్తాయి. ఇక రాష్ట్రంలో భారీ కార్యక్రమాల నిర్వహణకు వీలుగా బుక్‌ మై షోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.


ఫ్యూచర్‌ సిటీకి రేపు సీఎం భూమి పూజ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ కమిషనరేట్‌, టీజీఐఐసీ కార్యాలయాల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఔటర్‌ రింగు రోడ్డు నుంచి రీజనల్‌ రింగు రోడ్డును కలిపే రేడియల్‌ రోడ్ల పనులకు కూడా భూమి పూజ చేస్తారు.

నేడు 65 అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభం

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించే దిశగా.. 65 అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీ) సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. మల్లేపల్లి గవర్నమెంట్‌ ఐటీఐ కళాశాలలో ఐదు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించి ప్రజాప్రతినిధులు, శిక్షణార్థులు, అధ్యాపకులతో ప్రత్యక్షంగా సంభాషించనున్నారు. నేడు మొత్తం 65 ఏటీసీలు ప్రారంభం కానుండగా.. మరో 51 కేంద్రాలకు కూడా అనుమతులు లభించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 ఏటీసీలు పనిచేయనున్నాయి. 2047 నాటికి ఒక కోటి మంది యువతకు శిక్షణ ఇచ్చి, తెలంగాణను ప్రపంచ స్థాయి వర్క్‌ఫోర్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విద్యా సంవత్సరంలో 3 లక్షల మందికి షార్ట్‌ టర్మ్‌ కోర్సులను, ఇరవై వేల మంది వరకు యువతకు లాంగ్‌ టర్మ్‌ కోర్సులను అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

Updated Date - Sep 27 , 2025 | 03:38 AM