Telangana tourismరూ.15 వేల కోట్ల పెట్టుబడులు 3 లక్షల ఉద్యోగాలు
ABN , Publish Date - Mar 06 , 2025 | 04:29 AM
దీంట్లో భాగంగా ప్రకృతి, అధ్యాత్మికం, వైద్య పర్యాటకానికి పెద్ద పీట వేయనున్నారు. ప్రత్యేకంగా ఒక బుద్ధిస్ట్ సర్య్కూట్‌ను ఏర్పాటు చేయనున్నారు. నూతన పర్యాటక విధానంతో రాబోయే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులను రాబట్టాలని, 3 లక్షల అదనపు ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
రాష్ట్ర నూతన పర్యాటక
విధానం 2025-30 సిద్ధం
ఆధ్యాత్మికం, ప్రకృతి, ఆరోగ్య
పర్యాటకానికి ప్రాధాన్యం
ప్రత్యేకంగా బుద్ధిస్టు సర్క్యూట్
‘ప్రభుత్వ- ప్రైవేటు’లో ప్రాజెక్టులు
ఇన్వెస్టర్లకు 10-25ు రాయితీ
ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రోత్సాహక మండలి!
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పర్యాటక విధానం సిద్ధమైంది. దేశంలోనే టూరిజానికి రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో పర్యాటక శాఖ ఈ విధానాన్ని రూపొందించింది. దీంట్లో భాగంగా ప్రకృతి, అధ్యాత్మికం, వైద్య పర్యాటకానికి పెద్ద పీట వేయనున్నారు. ప్రత్యేకంగా ఒక బుద్ధిస్ట్ సర్య్కూట్‌ను ఏర్పాటు చేయనున్నారు. నూతన పర్యాటక విధానంతో రాబోయే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులను రాబట్టాలని, 3 లక్షల అదనపు ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ మేరకు ‘రాష్ట్ర టూరిజం పాలసీ 2025 -2030’పై గురువారం క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నట్టు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఇప్పటి వరకూ పర్యాటక విధానమే లేదు
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పర్యాటకానికి సంబంఽధించి ప్రత్యేకంగా ఒక పాలసీ లేదు. ఈ నేపథ్యంలోనే, ప్రత్యేక విధానం తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. నూతన పర్యాటక విధానంలో భాగంగా, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా టూరిజంను అభివృద్ధి చేయనున్నారు. ప్రధానంగా ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్)- రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య ప్రాంతాలను ఎంచుకోనున్నట్లు సమాచారం. పర్యాటక పాలసీ అమలు, అంతర్గత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలిని ఏర్పాటుచేస్తారు. దీనికి సీఎం అధ్యక్షులుగా, మంత్రులు సభ్యులుగా, టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనరుగా ఉంటారు. చట్టపరమైన సమస్యలు తలెత్తితే పరిష్కరించడం కోసం లీగల్ సెల్‌ను ఏర్పాటుచేస్తారు. ప్రధానమైన పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక టూరిస్టు పోలీస్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేక టూరిజం ప్రాంతాల అభివృద్ధి
పాలసీ కింద రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే 27 స్పెషల్ టూరిజం ఏరియాలను గుర్తించారు. వీటిలో తొలుత కొన్ని రంగాలపై దృష్టిపెట్టి వాటిని అభివృద్ధి చేస్తారు.
ప్రకృతి, ఆరోగ్యం (ఎకో, వెల్‌నెస్): వికారాబాద్‌లోని అనంతగిరి, కోట్‌పల్లి, పరిగి, దామగూడెం ప్రాంతాలను ప్రకృతి సందర్శన, సాహస క్రీడలు, ఆరోగ్యం పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేస్తారు.
అభయారణ్యాలు, జలపాతాలు: నల్లమల దగ్గర్లో కృష్టానది బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతం, అలంపూర్ శక్తిపీఠం, సోమశిల, కొల్లాపూర్, బీచుపల్లితో పాటు దేవాలయాలు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, జలపాతాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు.
రామప్ప: యునెస్కో గుర్తించిన ప్రఖ్యాత రామప్ప ఆలయంతోపాటు లక్నవరం, మేడారం, బొగత జలపాతం ప్రాంతాల అభివృద్ధి.
కాళేశ్వరం: ప్రకృతి, వారాంతపు పర్యాటక స్థలంగా అభివృద్ధి.
నాగార్జున సాగర్: బౌద్ధ వారసత్వం, ప్రకృతి, సాహస క్రీడల టూరిజంగా అభివృద్ధి.
భద్రాచలం: భద్రాచలం, పర్ణశాల, కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం, కిన్నెరసాని రిజర్వాయర్‌లను ఆధ్యాత్మిక, ఎకో, ట్రైబల్ టూరిజంగా అభివృద్ధి చేస్తారు.
ట్రైబల్ టూరిజం: జోడేఘాట్, ఉట్నూర్, ఉషేగావ్, కేస్లాగూడ, వన్యప్రాణుల అభయారణ్యం, జలపాతాలను గిరిజన పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తారు.
చార్మినార్: లాడ్‌బజార్, చార్మినార్, మక్కా మసీద్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియంల అభివృద్ధి.
కంపెనీలకు 10-25% వరకూ రాయితీలు
పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. టూరిజం ప్రాజెక్టులతో ముందుకు వచ్చే కంపెనీలకు పన్నులు, తక్కువ రేట్లకు భూములు తదితర రూపాల్లో 10 నుంచి 25ు వరకు రాయితీ ఇవ్వనున్నారు. రూ.500 కోట్లకు మించిన పెట్టుబడి లేదా 2000మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టును ఐకానిక్ ప్రాజెక్టుగా, రూ.100 కోట్లకు మించి పెట్టుబడి, లేదా 500 మందికి ఉపాధి కల్పించే దానిని మెగా ప్రాజెక్టుగా పేర్కొంటూ వర్గీకరణ చేపట్టనున్నారు. పర్యాటకానికి సంబంధించి దేశంలోని టాప్-5 రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణను తీసుకెళ్లాలని, రాష్ట్ర జీడీపీలో 10ు కంటే ఎక్కువగా ఆదాయం వచ్చేలా టూరిజంను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.