Share News

తెలంగాణలో బ్లాక్‌ చైన్‌ సిటీ

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:35 AM

తెలంగాణలో బ్లాక్‌ చైన్‌ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

తెలంగాణలో బ్లాక్‌ చైన్‌ సిటీ

క్వాంటం కంప్యూటింగ్‌లో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’

త్వరలో ఏఐ సిటీకి శంకుస్థాపన : శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బ్లాక్‌ చైన్‌ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. డ్రోన్‌ టెక్నాలజీ, రోబోటిక్స్‌ రంగంలో దాదాపు 1,800 మందికి ఉపాధి కల్పిస్తున్న సెంటిలియన్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ హెచ్‌సీ రోబోటిక్స్‌ కంపెనీ నూతన క్యాంప్‌సను మంత్రి శుక్రవారం మాదాపూర్‌లో ప్రారంభించారు. ‘కొత్త సాంకేతికతల ఆవిష్కరణలో తెలంగాణను నంబర్‌ వన్‌గా నిలిచేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. ఫ్యూచర్‌ సిటీలో నిర్మించ తలపెట్టిన ఏఐ యూనివర్సిటీకి త్వరలో శంకుస్థాపన చేయబోతున్నాం. అలాగే ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించబోతున్నాం’ అని వెల్లడించారు. ‘దేశంలో ఫ్రాంటియర్‌ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉంది. ఆ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. ఇక్కడి అనుకూలతలను వివరించాం.’ అని తెలిపారు. పౌర సేవలను చివరి వ్యక్తి వరకు సమర్థంగా అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు.

సంచార ప్రయోగశాల ‘ఫ్లో’ ప్రారంభం..

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఫ్యూచరిస్టిక్‌ ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌ (ఫ్లో) వాహనాన్ని మంత్రి శ్రీధర్‌ బాబు సచివాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, వర్చువల్‌ రియాలిటీ, రోబోటిక్స్‌, 3డీ ప్రింటింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌లతో కూడిన పరికరాలు, నిపుణులతో కూడిన ఈ ప్రత్యేక వాహనం 33 జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లనుంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం స్ఫూర్తి యాత్ర-33 పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. దీనికయ్యే వ్యయం లక్ష డాలర్ల సాయాన్ని ‘సేల్స్‌ ఫోర్స్‌ ఇండియా’ సంస్థ అందించింది. 45 రోజుల్లో 33 జిల్లాలకు చేరి ఫ్లో వాహనం విద్యార్థులకు అవగాహన కల్పిస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో సీఈవో మధులాష్‌, సలహాదారు వికాస్‌ కాట్రగడ్డ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 05:35 AM