Nomadic Tribes: 10న రవీంద్ర భారతిలో.. సంచార జాతుల విముక్తి దినోత్సవం
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:23 AM
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ఈ నెల 10న సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ఈ నెల 10న సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైంది. ప్రధానంగా వెనకబడిన వర్గాల్లో యాచక, సంచార జాతులకు తగిన గుర్తింపునిచ్చేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది.
అత్యంత వెనకబడిన కులాలకు సైతం అన్ని వర్గాలతో సమ ప్రాధాన్యం కల్పించడానికి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఎంబీసీ కార్పొరేషన్ సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొంటారు.