Share News

AI Capital: ఏఐ రాజధానిగా తెలంగాణ

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:41 AM

తెలంగాణను ప్రపంచానికి కృత్రిమ మేధ (ఏఐ) రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

AI Capital: ఏఐ రాజధానిగా తెలంగాణ

  • అదే మా సర్కారు సంకల్పం: శ్రీధర్‌ బాబు

  • జాగర్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ప్రారంభం

హైదరాబాద్‌, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణను ప్రపంచానికి కృత్రిమ మేధ (ఏఐ) రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఏఐ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ఏఐ సిటీని అభివృద్ధి చేయనున్నామని.. ప్రపంచానికి ఏఐ నిపుణులను అందించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నొవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో అమెరికా సంస్థ జాగర్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సాంకేతికతకే కాకుండా అన్ని రంగాలకు చెందిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారింది. ఈ జాబితాలో జాగర్‌ కూడా చేరడంతో తెలంగాణ బ్రాండ్‌ మరింత విశ్వవ్యాప్తం అవుతుంది. కొత్తగా ప్రారంభమైన ఈ జీసీసీ ద్వారా 180 మందికి ఉపాధి లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 500కు చేరుతుంది’ అని తెలిపారు. కార్యక్రమంలో జాగర్‌ సీఈవో ఆండ్రూ రోస్కో, చీఫ్‌ డిజిటల్‌ డెవల్‌పమెంట్‌ గోపీనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 04:41 AM