Share News

Broken Rice Auction: 1.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యం వేలం

ABN , Publish Date - Aug 12 , 2025 | 05:11 AM

రాష్ట్రవ్యాప్తంగా గోదాములు, రేషన్‌ షాపుల్లో మిగిలిపోయిన 1.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యాన్ని వేలం పాటలో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Broken Rice Auction: 1.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యం వేలం

  • గోదాములు, రేషన్‌ షాపుల్లో ఉన్నదంతా అమ్మకం.. క్వింటా రూ.2,250 కంటే ఎక్కువకు అమ్మాలని నిర్ణయం

  • 2,3 రోజుల్లో నోటిఫికేషన్‌కు అవకాశం

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గోదాములు, రేషన్‌ షాపుల్లో మిగిలిపోయిన 1.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యాన్ని వేలం పాటలో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావు, మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బఫర్‌ గోదాముల్లో లక్ష టన్నులు, మండల స్థాయి స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్లలో 13 వేల టన్నులు, రేషన్‌ షాపుల్లో 27 వేల టన్నుల దొడ్డు బియ్యం నిల్వలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించటంతో.. దొడ్డు బియ్యం అవసరం లేకుండాపోయింది. దీంతో, దొడ్డు బియ్యం విక్రయానికి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి, ఎఫ్‌సీఐ తన వద్ద ఉన్న బియ్యం నిల్వలను క్వింటాలుకు రూ.2,250 చొప్పున విక్రయించాలని నిర్ణయించింది. అయితే, ఎఫ్‌సీఐ ప్రొవిజనల్‌ కాస్టింగ్‌ షీట్‌ ప్రకారం.. బియ్యం ధర క్వింటాలుకు రూ.3,600 ఉంటుంది. కానీ, ఎఫ్‌సీఐ మాత్రం రూ.2,250 చొప్పున విక్రయాలు చేపడుతోంది. అయితే, ఈ ధరకు బియ్యం అప్పగించటానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదని తెలిసింది. ఆ లెక్క ప్రకారం బియ్యం విక్రయిస్తే నష్టపోవాల్సి వస్తుందని, ఎఫ్‌సీఐ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధర వస్తేనే బియ్యం విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది. నిజానికి, ఇతర రాష్ట్రాల్లో ఆహార అవసరాలకు దొడ్డు బియ్యం విక్రయించాలని ఇప్పటికే ప్రయత్నాలు చేసింది. పౌర సరఫరాల శాఖ అధికారులు కర్ణాటక వెళ్లి వచ్చారు. కానీ, స్పందన లేదు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ సహా ఎఫ్‌సీఐ ద్వారా తెలంగాణ బియ్యం వెళ్లే 8 రాష్ట్రాలకు ఎగుమతి చేయటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే, గ్లోబల్‌ టెండర్లు పిలిచి దొడ్డు బియ్యం విక్రయించి, వీలైనంత ఎక్కువ ధరను సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో టెండరు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలున్నాయి. అయితే, కొన్నిచోట్ల రేషన్‌ షాపుల్లో ఉన్న బియ్యాన్ని డీలర్లు అమ్ముకున్నారని, మరి కొన్నిచోట్ల ముక్కిపోయాయని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో, ఎలాంటి తరుగు లేకుండా 1.40 లక్షల టన్నులకు టెండర్లు పిలుస్తామని, ఒక్క గింజ తేడా లేకుండా రేషన్‌ షాపుల్లో, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, బఫర్‌ గోదాముల్లో బియ్యం నిల్వలు ఉంచి వేలం వేస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Aug 12 , 2025 | 05:11 AM