Share News

Telangana RTI: సమాచార హక్కు అప్పీళ్లపై రేపటి నుంచి విచారణ

ABN , Publish Date - Jun 11 , 2025 | 07:20 AM

రాష్ట్ర సమాచార కమిషన్‌ గురువారం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా ఐఎ్‌ఫఎస్‌ అధికారి జి.చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్లుగా ఐదుగురిని ప్రభుత్వం ఇటీవలే నియమించింది.

Telangana RTI: సమాచార హక్కు అప్పీళ్లపై రేపటి నుంచి విచారణ

  • కార్యకలాపాలు ప్రారంభించనున్న కొత్త ప్రధాన కమిషనర్‌, కమిషనర్లు

  • రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పనిచేయనున్న సమాచార కమిషన్‌

  • 20వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌

  • వేగంగా పరిష్కరించాలని నిర్ణయం

  • హాజరుకాని సమాచార అధికారులపై చర్యలకు యోచన

  • వార్షిక నివేదికల విడుదలకు సన్నాహాలు

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమాచార కమిషన్‌ గురువారం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా ఐఎ్‌ఫఎస్‌ అధికారి జి.చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్లుగా ఐదుగురిని ప్రభుత్వం ఇటీవలే నియమించింది. వీరితోపాటు రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యాలయంలోని 20 మంది అధికారులు, ఉద్యోగులకు నాలుగు రోజులు శిక్షణ ఇచ్చారు. సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు వారికి సూచనలు చేశారు. కీలక అంశాలపై అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టం అమల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనుకబడి ఉంది. దీనికి కారణాలను గుర్తించిన కమిషన్‌.. ఈ చట్టం పక్కాగా అమలయ్యేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. వాస్తవానికి 2023 ఫిబ్రవరి నుంచి తాజా నియామకాల వరకు రాష్ట్రంలో సమాచార కమిషనర్లు లేరు. అప్పీళ్ల విచారణ జరగకపోవడంతో.. 20వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రెవెన్యూ శాఖకు చెందిన 5,222 అప్పీళ్లు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 3,189, హోం శాఖ 1,468, పాఠశాల విద్య 1,122, ఆర్థిక శాఖకు చెందిన 858 అప్పీళ్లు ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని కమిషన్‌ భావిస్తోంది. పెండింగ్‌ అప్పీళ్ల విచారణ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ప్రధాన కమిషనర్‌, ఐదుగురు కమిషనర్లు ఇందులో పాల్గొంటారు.


హాజరుకాని పీఐవోలపై చర్యలు

సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని అధికారులు గరిష్ఠంగా 30 రోజుల్లో ఇవ్వాలి. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని ఉన్నతాధికారి ప్రజా సమాచార అధికారి (పీఐవో)గా, ఆ తర్వాతి స్థాయి అధికారి సహాయక సమాచార అధికారి (ఏపీఐవో)గా వ్యవహరించాలి. కానీ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు దీనిపై రాష్ట్ర కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఆయా అధికారులు హాజరవకుండా కిందిస్థాయి సిబ్బందిని విచారణకు పంపిస్తున్నారు. ఈ అంశంపై కమిషన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక నుంచి సమాచార జాప్యానికి కారణమైన అధికారి తప్పకుండా హాజరవాలని, రాకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కమిషన్‌ నిర్ణయించినట్లు తెలిసింది. ఇక నిబంధనల మేరకు సమాచార కమిషన్‌ క్రమం తప్పకుండా వార్షిక నివేదికలు విడుదల చేయాలి. వాటిని శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టాలి. కానీ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి వార్షిక నివేదికల జాడే లేదు. తొలుత మూడేళ్లు కమిషనే లేదు. 2017 సెప్టెంబర్‌లో కమిషన్‌ ఏర్పాటైనా వార్షిక నివేదికలు విడుదల చేయలేదు. ఇకముందు వార్షిక నివేదికలు విడుదల చేసే అంశంపైనా కమిషనర్లు దృష్టిపెట్టారు. అంతేకాదు ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలు జిల్లాలవారీగా ప్రతీ మూడు నెలలకోసారి సమాచార హక్కు దరఖాస్తుల వివరాలు తెలపాలని కమిషన్‌ కోరనుంది.

Updated Date - Jun 11 , 2025 | 07:23 AM