Telangana RTC: ఆర్టీసీలో 3 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:05 AM
తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో మొదటి విడతలో భాగంగా 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
మొదటగా 1,500 కండక్టర్ పోస్టుల భర్తీ
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో మొదటి విడతలో భాగంగా 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈమేరకు పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్టీసీ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. వాస్తవానికి ఆర్టీసీలో 2013నుంచి కండక్టర్ల నియామకాలు జరగలేదు. తాత్కాలికంగానే తీసుకుంటూ వచ్చారు. సంస్థలో రిటైర్మెంట్లు పెరుగుతుండడం, ఉన్నవారిపై పనిభారం పడుతున్న నేపథ్యంలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే సంస్థలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కొన్ని పోస్టులు కలిపి మొత్తం 3,035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది. ఇందులో కండక్టర్ పోస్టులను తొలుత భర్తీ చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ వెలువడుతుందని అధికార వర్గాల సమాచారం.