Share News

TG Govt: ‘మూడు నెలల రేషన్‌’కు గడువు కోరిన రాష్ట్రం

ABN , Publish Date - May 22 , 2025 | 07:46 AM

వర్షాకాలానికి ముందుగా మూడు నెలల రేషన్‌ బియ్యం నిల్వ చేయాలన్న కేంద్ర ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వెంటనే సమకూర్చలేమని తెలిపి, జూన్‌ చివర వరకు గడువు కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది.

TG Govt: ‘మూడు నెలల రేషన్‌’కు గడువు కోరిన రాష్ట్రం

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలానికి ముందే మూడు నెలలకు సరిపడా రేషన్‌ బియ్యం నిల్వలను పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికిప్పుడు సమకూర్చలేమని, మరో నెల రోజుల గడువు కావాలని కేంద్రానికి లేఖ రాసింది. అంటే మే నెలాఖరుకు కాకుండా, జూన్‌ ఆఖరుకు సమకూరుస్తామని లేఖలో పేర్కొంది. జూన్‌ నుంచి వానాకాలం మొదలవుతుందని, వరదలు, వాగులు, వంకలు పొంగటం వంటి సమస్యలు ఎదురైతే... పేద ప్రజలకు ఆహారధాన్యాలు చేరవేయడం ఇబ్బందిగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. జూన్‌, జూలై, ఆగస్టు నెలల బియ్యం కోటాను జూన్‌లోనే అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రం సుమారు 5లక్షల టన్నుల బియ్యం సమకూర్చాల్సి ఉంటుంది. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మూడు నెలల కోటాను సర్దుబాటు చేయటం కష్టమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్రంలోని పరిస్థితులను వివరించి, జూన్‌ ఆఖరు వరకు గడువు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జూన్‌లో ఒక నెల కోటా, జూలైలో రెండు నెలల కోటాను సరఫరా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Updated Date - May 22 , 2025 | 07:52 AM