Cold Wave: 25 డేస్.. సింగిల్ డిజిట్!
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:31 AM
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలి వేయడం మామూలే.. ఒక్కోసారి రెండు, మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడమూ సాధారణమే.
రాష్ట్రంలో ఈ ఏడాది చలి కొత్త రికార్డులు
చాలా జిల్లాల్లో 25 రోజులుగా 10 డిగ్రీలలోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు
కొన్నిరోజులు ఉష్ణోగ్రతలు పడిపోవడం మామూలే.. ఇన్ని రోజులు మాత్రం అసాధారణం.. గత పదేళ్లలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు
ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు, లానినా ఎఫెక్ట్ వల్లే ఈ పరిణామం
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలి వేయడం మామూలే.. ఒక్కోసారి రెండు, మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడమూ సాధారణమే. కానీ ఈసారి మాత్రం రాష్ట్రంలో చాలా అసాధారణ పరిస్థితి నెలకొంది. నవంబరు నెలలో వరుసగా పది, పన్నెండు రోజులపాటు చలి ప్రభావం కనిపించింది. ఈ నెలలో అయితే 6వ తేదీన మొదలైన తీవ్ర చలి ఇంకా వణికిస్తూనే ఉంది. గత 25 రోజులుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకన్నా తక్కువగా నమోదవుతుండటం గమనార్హం. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 8 డిగ్రీలలోపే రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు, లానినో ప్రభావం, విస్తారమైన వర్షాలతో నీటి నిల్వలు ఉండటం, అల్పపీడనాలు, తుఫానులు వంటివేమీ లేక మేఘాలు ఏర్పడకపోవడం, వాతావరణంలో తేమశాతం తగ్గడం వంటివి దీనికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
నెల రోజులు ముందుగానే చలి పంజా
సాధారణంగా రాష్ట్రంలో డిసెంబరు చివరి నుంచి జనవరి రెండో వారం మధ్య చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి నవంబరు రెండోవారం నుంచే మొదలైంది. డిసెంబరు రెండో వారానికే అంటే నెల రోజులు ముందుగానే పతాక స్థాయికి చేరింది. కోహిర్, సిర్పూర్ వంటి ప్రాంతాల్లో 25 రోజులుగా ఆరేడు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మిగతా జిల్లాల్లోనూ 10 నుంచి 14 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. డిసెంబరు 20న సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 4.5, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 4.8, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 5.1 డిగ్రీల అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. ఇక రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌నూ చలి వణికిస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో 8 నుంచి 12 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డిసెంబరు 12న హెచ్‌సీయూ ప్రాంతంలో 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పగటిపూట వాతావరణం నిర్మలంగా ఉండి, నేరుగా ఎండ పడుతున్నా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 24 నుంచి 28 డిగ్రీలలోపే ఉంటుండటం గమనార్హం. సాధారణంగా హిమాలయాలకు దగ్గరగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందని.. దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొనడం అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
‘కాలం మారుతోంది’!
జూన్ వస్తే వానలు, నవంబర్ నుంచి చలి, మార్చి రాగానే ఎండలు.. ఇదీ రుతువుల తీరు. కానీ కొన్నేళ్లుగా రుతువులు తారుమారవుతున్నాయి. ఈసారి వేసవిలో విస్తారంగా వానలు పడ్డాయి. అసలు ఎండాకాలం అనిపించకుండానే ముగిసిపోయింది. మే చివరి నాటికే రుతుపవనాలు వచ్చినా జూన్ నుంచి జూలై మధ్య వరకు వానలు సరిగా పడలేదు. ఆ తర్వాత మొదలైన వానలు నవంబరు మొదటివారం దాకా కురుస్తూనే ఉన్నాయి. అంతేకాదు తక్కువ సమయంలోనే అతిభారీ వానలు పడ్డాయి. జూన్ నుంచి అక్టోబరు మధ్య సాధారణ వర్షపాతం 85.1 సెంటీమీటర్లు అయితే.. ఈసారి ఏకంగా 117.8 సెంటీమీటర్లు.. అంటే 38 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక డిసెంబరు చివర్లో ఉండాల్సిన చలి నవంబరు మధ్య నుంచే మొదలైంది. తెలంగాణ ఒక్కటే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరిగింది. కాలుష్యం, అడవుల నరికివేత వల్ల భూతాపం (గ్లోబల్ వార్మింగ్) పెరిగిపోవడం, పర్యావరణంలో అసమతుల్యత కారణంగా రుతువులు గాడితప్పుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరికొన్ని రోజులు తప్పని చలి
రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని రోజులు చలి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. తెల్లవారుజాము, ఉదయం వేళల్లో పొగమంచు ముసురుకుని, మసక వాతావరణం నెలకొంటుందని తెలిపింది.
లానినో ప్రభావంతోనే ఈ పరిస్థితి
ప్రస్తుతం లానినో (పసిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గడం) పరిస్థితులు నెలకొన్నాయి. వాణిజ్య పవనాలు బలంగా వీయడంతో భూభాగాలపైకి చేరే తేమ శాతం పెరిగింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నుంచే ఈ ప్రభావం మొదలవడంతో వేసవిలోనూ వానలు పడ్డాయి. ఎండల తీవ్రత కనిపించలేదు. లానినో పరిస్థితుల వల్ల రుతుపవనాలు కూడా త్వరగా వచ్చాయి. భారీ వర్షాలు కురిశాయి. ఈశాన్య రుతుపవనాలు మొంథా తుఫాన్ వల్ల గాడి తప్పాయి. తమిళనాడులో పడాల్సిన వర్షాలు అక్టోబరులో తెలంగాణలో కురిశాయి. నవంబరు నుంచి పొడి వాతావరణం నెలకొంది. ఆ నెల 7 నుంచి 25 వరకు చలి తీవ్రత పెరిగింది. తర్వాత బంగాళాఖాతంలో తుఫానుతో కొన్ని రోజులు చలి తగ్గింది. తిరిగి డిసెంబరు 6 నుంచి కోల్డ్ వేవ్ కొనసాగుతోంది.
- టి.బాలాజీ, తెలంగాణ వెదర్‌మ్యాన్
ఈ వార్తలు కూడా చదవండి:
Vaikuntha Ekadashi: ముక్కోటి వేళ.. దేవాలయాలకు పోటెత్తిన భక్త కోటి
Sankranthi special buses: బీహెచ్‌ఈఎల్ నుంచి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు