Income Tax Returns: ఐటీ రిటర్నుల దాఖలులో రెండో స్థానంలో తెలంగాణ!
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:30 AM
ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలులో తెలంగాణ తన నిబద్ధతను చాటుకుంది. రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలు తమ వార్షికాదాయాలను ప్రకటించడంతో పాటు నిజాయతీగా పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నట్లు వెల్లడైంది.
రూ.12 లక్షల నుంచి 50 లక్షల మధ్య విభాగంలో 19.8 శాతం మంది ఫైలింగ్
20.6 శాతంతో కర్ణాటకకు తొలి స్థానం
టాప్-10లో గుజరాత్‌కు దక్కని చోటు
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలులో తెలంగాణ తన నిబద్ధతను చాటుకుంది. రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలు తమ వార్షికాదాయాలను ప్రకటించడంతో పాటు నిజాయతీగా పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నట్లు వెల్లడైంది. రూ.12 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య వార్షికాదాయం గల పన్ను చెల్లింపుదారుల్లో కర్ణాటక తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 19.8 శాతం వ్యాపారులు, వివిధ వృత్తుల నిపుణులు తమ ఆదాయ వివరాలను వెల్లడించారు.తొలిస్థానంలో ఉన్న కర్ణాటక నుంచి 20.6 శాతం మంది పన్ను రిటర్నులను దాఖలు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి దాఖలైన ఆదాయ పన్ను రిటర్నుల డేటా ఇటీవల వెలుగులోకి వచ్చింది. రూ.12 లక్షల నుంచి 50 లక్షల మధ్య వార్షికాదాయం విభాగంలో కర్ణాటక, తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఝార్ఖండ్ (19.5%), తమిళనాడు (18.8%), ఢిల్లీ (17.6%), పాండిచ్చేరి(17.4%), ఒడిశా (16.8%), మహారాష్ట్ర (16.2%), ఆంధ్రప్రదేశ్ (15.9%), ఉత్తరాఖండ్ (14.2%) నిలిచాయి. ఈ విభాగం పన్ను చెల్లింపుదారుల్లో జాతీయ సగటు 14.1 శాతం కాగా.. తెలంగాణ అంతకంటే ఎక్కువగా 19.8 శాతంతో ఉండడం విశేషం.
అయితే సంపన్న రాష్ట్రంగా చెప్పుకొంటున్న గుజరాత్ (7ు) తొలి పది స్థానాల్లో ఉండకపోవడం గమనార్హం. ఇటు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య వార్షికాదాయం గల విభాగంలోనూ గుజరాత్ తొలి 10 స్థానాల్లో చోటు సంపాదించలేకపోయింది. దేశవ్యాప్తంగా పన్ను రిటర్నులను దాఖలు చేసిన గ్రూపుల్లో రూ.2.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్య వార్షికాదాయం గల వర్గమే మొదటి స్థానంలో ఉంది. అంటే.. దేశంలోని మొత్తం రిటర్నులు దాఖలు చేసిన వారిలో సగానికంటే ఎక్కువ వీరే ఉన్నారు. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య వార్షికాదాయం గల విభాగం రిటర్నుల దాఖలులో 1.4 లక్షల మందితో మహారాష్ట్ర దేశంలోనే తొలి స్థానాన్ని ఆక్రమించింది. కర్ణాటక రెండో స్థానంలో, తమిళనాడు మూడో స్థానంలో ఉండగా.. 60.8 వేల మందితో తెలంగాణ ఐదో స్థానంలో, 26.7 వేల మందితో ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉన్నాయి.