Share News

Private Colleges Announce Indefinite Strike: వెయ్యికి పైగా కాలేజీలు బంద్‌

ABN , Publish Date - Sep 15 , 2025 | 05:52 AM

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉన్నత విద్యాసంస్థలూ సోమవారం నుంచి నిరవధిక బంద్‌ పాటించనున్నాయి. పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, నర్సింగ్‌...

Private Colleges Announce Indefinite Strike: వెయ్యికి పైగా కాలేజీలు బంద్‌

  • నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల నిరవధిక మూసివేత

  • ఫార్మసీ, బీఈడీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు వాయిదా

  • దసరాలోపు బకాయిలు 1200 కోట్లు ఇస్తేనే విరమణ

  • 21, 22న 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్‌లో ధర్నా

  • ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య భేటీలో నిర్ణయం

  • రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం

  • గత సర్కారు పాపాన్ని.. ప్రస్తుత ప్రభుత్వం మోస్తోంది

  • ఆ సానుభూతి ఉన్నందునే 20 నెలలు ఓపిక పట్టాం

  • ఐఏఎ్‌సలు ఒక్క నెల జీతం త్యాగానికి సిద్ధపడతారా?

  • ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య చైర్మన్‌ రమేశ్‌

  • కళాశాలల యాజమాన్యాలతో ముగిసిన చర్చలు

  • నేడు నిర్ణయం తీసుకుంటాం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉన్నత విద్యాసంస్థలూ సోమవారం నుంచి నిరవధిక బంద్‌ పాటించనున్నాయి. పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, నర్సింగ్‌, లా, మేనేజ్మెంట్‌, బీఈడీ ప్రైవేటు కాలేజీలన్నీ బంద్‌ అవుతాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య (ఫాతీ) ప్రకటించింది. బంద్‌ గురించి ఫాతీ ఈ నెల 12న ప్రభుత్వానికి నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి శనివారం సమాఖ్య ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై బంద్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనికి వారు.. ఇప్పటివరకూ ఉన్న మొత్తం బకాయిలు రూ.8 వేల కోట్లలో.. ఈ విద్యాసంవత్సరంలోఇస్తామంటూ బడ్జెట్‌లో కేటాయించిన రూ.1200 కోట్లు తక్షణం చెల్లించాలని, నిరుటి బకాయిలు డిసెంబరు-31 నాటికి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ దీనిపై వారికి కచ్చితమైన హామీ లభించలేదు. బంద్‌పై ఆదివారం హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎ్‌ఫఏయూలో అత్యవసరసర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, లా, మేనేజ్మెంట్‌ సహా అన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులూ కలిపి మొత్తం 760 మంది పాల్గొన్నారు. నోటీసు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన హామీ లభించకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సోమవారం నుంచి నిరవధిక బంద్‌ చేయాలని సమావేశంలో తీర్మానించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం (సెప్టెంబరు 15) ‘ఇంజినీర్స్‌డే’ను బ్లాక్‌ డేగా నిర్వహించనున్నట్టు ఇంజినీరింగ్‌ కాలేజీలు ప్రకటించాయి. ఈనెల 21, 22న 10 లక్షల మంది విద్యార్థులతో నగరంలో భారీ ధర్నా నిర్వహిస్తామని సమాఖ్య ప్రతినిధులు ప్రకటించారు. ఇప్పటికే కాలేజీలకు టోకెన్లు అందించిన రూ.1200 కోట్లు విడుదల చేయాలని, కిందటి సంవత్సరం బకాయిలను ఈ ఏడాదిలోపు విడుదల చేస్తామని హామీ ఇస్తే సమ్మె విరమిస్తామని ప్రకటించారు.

22.jpg


పాపమంతా గత ప్రభుత్వానిదే: సమాఖ్య చైర్మన్‌

‘‘నాలుగేళ్లుగా ఫీజు బకాయిలు విడుదల చేయలేదు. కాలేజీల నిర్వహణ భారంగా మారింది. సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్థితిలో కాలేజీల యాజమాన్యాలు ఉన్నాయ’’ని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య చైర్మన్‌ నిమ్మటూరి రమేశ్‌ బాబు అన్నారు. ఫీజులకు సంబంధించి ఇప్పటివరకూ ఉన్న మొత్తం రూ.7500 కోట్ల బకాయిల్లో.. రూ.5500 కోట్లు కేసీఆర్‌ ప్రభుత్వ హయాం నాటివేనని.. గత ప్రభుత్వం చెల్లించకపోవడంతో సమస్య మరింత ఇబ్బందికరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సానుభూతి ఉంది. విద్యాశాఖ మంత్రిత్వ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డిపై గౌరవం ఉంది. అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడి 20నెలలు గడుస్తున్నా ఎన్నడూ ఒత్తిడి చేయలేదు. ఇప్పుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది’ అని రమేశ్‌బాబు ఆవేదన వెలిబుచ్చారు. సమస్యను పరిష్కరించేందుకు వెళ్తే కొందరు ఐఏఎ్‌సలు హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. ‘‘కనీసం ఒక్క నెలైనా జీతం లేకుండా పనిచేసేందుకు ఐఏఎ్‌సలు సిద్ధంగా ఉన్నారా? దసరా సంబరాలు ఐఏఎ్‌సలు, ప్రభుత్వ అధికారులే చేసుకోవాలా? ప్రైవేటు కాలేజీల సిబ్బంది చేసుకోకూడదా?’’అని ప్రశ్నించారు. తమ బంద్‌ నిర్ణయంతో ఇబ్బందులు పడనున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందికి ఆయన క్షమాపణలు చెప్పారు. సోమవారం నుంచి కాలేజీలు ఉండవని, విద్యార్థులు కళాశాలలకు రావద్దని కోరారు.

కాంట్రాక్టర్లు బెదిరించి వసూలు చేసుకున్నరు..

ఉన్నత విద్యను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. ఈ ప్రభుత్వం సైతం అదే దారి అవలంబిస్తోందని సమాఖ్య సెక్రటరీ జనరల్‌ కేఎస్‌ రవికుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కే.సునీల్‌ కుమార్‌, గ్రామీణ ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు అలీజాపూర్‌ శ్రీనివాస్‌, డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సూర్యనారాయ ణ రెడ్డి విమర్శించారు. ఫీజు బకాయిలు నాలుగేళ్లుగా రాకపోయినా తాము మౌనంగా ఓపిక పట్టామని వారు పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు మాత్రం గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలోనూ ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి తమకు రావాల్సిన బకాయిలను బెదిరించి వసూలు చేసుకున్నారని ఆరోపించారు. ఉన్నత విద్యా రంగాన్ని మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


పరీక్షలన్నీ వాయిదా.. !

ప్రస్తుతం ఫార్మసీ ద్వితీయ, తృతీయ సంవత్సరం పరీక్షలతోపాటు బీఈడీ పరీక్షలూ జరుగుతున్నాయి. ఇంజనీరింగ్‌ ఇంటర్నల్‌ పరీక్షలూ కొ నసాగుతున్నాయి. బంద్‌ నేపథ్యంలో అన్ని కాలేజీలకు తాళాలు వేస్తామని.. పరీక్షలను వాయిదా వేసుకోవాలని అన్ని విశ్వవిద్యాలయాలు ఉపకులపతులు, రిజిస్ట్రార్‌లకు ఫాతీ లేఖలు రాసింది.

వెయ్యికి పైగా కాలేజీలు బంద్‌

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా ప్రైవేటు కాలేజీలు సోమవారం నుంచి జరగనున్న బంద్‌తో మూతపడనున్నాయి. వాటిలో 170 ఇంజినీరింగ్‌ యూజీ, పీజీ కాలేజీల్లో దాదాపు 5 లక్షల విద్యార్థులు ఉండగా, డిగ్రీ, పీజీ, ఇతర కాలేజీలన్నీ కలిపి 850వరకు ఉన్నాయి. వాటిలో దాదాపు 9 లక్షల మంది విద్యార్థులున్నారు. ఈ 14 లక్షల మంది విద్యార్థులపై బంద్‌ ప్రభావం పడనుంది. ఆయా కాలేజీల్లో పనిచేసే దాదాపు 25వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఇంటికే పరిమితం కానున్నారు.

Updated Date - Sep 15 , 2025 | 05:52 AM