Uttam Kumar Reddy: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణ
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:19 AM
తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు
పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
టాప్ 5 స్థానమే లక్ష్యం
రూ. 15 వేల కోట్ల పెట్టుబడులనుఆకర్షించేలా కొత్త విధానం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ప్రభుత్వం ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించిందని ఆయన వివరించారు. శనివారం లక్డీకాపూల్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సదరన్ ట్రావెల్స్ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. 2025- 30 పర్యాటక నూతన విధానం లో భాగంగా తెలంగాణను ప్రపంచంలోని టాప్ 5 పర్యాటక గమ్యస్థానాలలో ఒకటి నిలపడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రస్తుతం గుర్తింపు పొందిన పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు కొత్తగా జలపాతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, వారసత్వ ప్రాంతాలు, ఏకో-టూరిజం, వెల్నెస్ కేంద్రాలు, క్రాఫ్ట్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. దీనితో పాటు మరో 27 ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, ప్రాంతీయ రింగ్ రోడ్ల వెంట డ్రై పోర్టులు, గోదావరి, కృష్ణా నదులపై రివర్ బెస్ట్ టూరిజం, నగరాల్లో వాటర్ ఫ్రంట్ హబ్‌ల వంటి ప్రత్యేకతలతో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. పర్యాటక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని, పర్యాటక రంగ అభివృద్థికి సదరన్ ట్రావెల్స్ భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. ఈ కృషిలో భాగంగా డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు కూడా ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు.