Share News

Telangana Ministers Pledge: తుమ్మిడిహెట్టి కట్టి తీరతాం

ABN , Publish Date - Aug 11 , 2025 | 04:35 AM

తమ్మిడిహెట్టి ప్రాజెక్టును కట్టి తీరుతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు

Telangana Ministers Pledge: తుమ్మిడిహెట్టి కట్టి తీరతాం

  • త్వరలోనే పనులు ప్రారంభిస్తాం

  • ఇచ్చంపల్లి నుంచే నదుల అనుసంధానం

  • కేంద్రానికి ప్రతిపాదనలు చేశాం

  • నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌

  • దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తాం

  • భూసేకరణకు నిధులు ఇస్తాం: భట్టి

  • ‘జవహర్‌ ఎత్తిపోతల’కు శంకుస్థాపన

వరంగల్‌/ఖమ్మం/మధిర, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తమ్మిడిహెట్టి ప్రాజెక్టును కట్టి తీరుతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తమ్మిడిహెట్టి కట్టి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని మళ్లించి ఉంటే 16 లక్షల ఎకరాలకు నీరు అందేదని, కానీ గత ప్రభుత్వం ప్రణాళికలు లేకుండా మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిందని విమర్శించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన అప్పులకు రానున్న రోజుల్లో రూ.40 వేల కోట్ల అసలు, రూ.26 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందన్నారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నివేదికను బట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పనికిరావని స్పష్టం చేశారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెంలో గోదావరిపై నిర్మించిన సమ్మక్క-సారక్క బ్యారేజీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పరిశీలించారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే ఖమ్మం జిల్లాలో జవహర్‌ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా కూడా మాట్లాడారు. ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఇక్కడే గోదావరి, కావేరి నదు ల అనుసంధానానికి ప్రాజెక్టు నిర్మించాలని కేంద్రానికి ప్రతిపాదన చేశానని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ ఘోష్‌ ఇచ్చిన నివేదికను అపహా స్యం చేసేలా బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడటం హేయమని విమర్శించారు. కాళేశ్వరంపై జస్టిస్‌ ఘోష్‌ రిపోర్టు జడ్జి తీర్పులాంటిదన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్‌ కోసం 2 లక్షల కోట్ల అప్పులు చేసిందని, వాటికి ఏటా రూ.16 వేల కోట్ల అసలు, వడ్డీ చెల్లిస్తున్నామని చెప్పారు. నీటి పారుదల శాఖకు కేటాయించిన రూ.23 వేల కోట్లలో 70ు వాటికే పోతున్నాయన్నారు. సమ్మక్క బ్యారేజీపై ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందన్నారు. ఎంత నష్టం జరిగినా తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని ఛత్తీ్‌సగడ్‌కు తెలిపామని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


దేవాదులను పూర్తి చేస్తాం: భట్టి విక్రమార్క

బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ నిటారుగా నిలబడ్డారు కాబట్టే ఏపీ చేపట్టిన బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఆగాయన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్‌ ముఖ్యమంత్రి, కేంద్రంలో మోదీ ప్రధాని అయిన తర్వాత అమాయకులైన గిరిజనులకు సంబంధించిన 2 లక్షల ఎకరాలను ఆర్డినెన్స్‌ ఇచ్చి పోలవరం కట్టుకోవడానికి ధారాదత్తం చేశారన్నారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. దేవాదులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 33 వేల ఎకరాలకు నీరందించేందుకు రూ.630 కోట్లతో చేపట్టిన జవహర్‌ ఎత్తిపోతల పథకానికి భట్టి శంకుస్థాపన చేశారు. ఈ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎర్రుపాలెం మండలం మొలుగుమాడులో పైలట్‌ ప్రాజెక్టు మాదిరిగానే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం వంటి పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని, అలా కాకుండా తక్కువ వ్యయంతో 30 వేల ఎకరాలకు నీరిచ్చేలా జవహర్‌ ఎత్తిపోతల పథకం రూపొందించామని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. మంత్రి సీతక్క, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 04:35 AM