Bhatti Vikramarka: ఎంఎస్‌ఎంఈ పార్కులకు నిధులివ్వండి
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:10 AM
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు. ఎంఎ్‌సఎంఈ పార్కులు, యూరియా, ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం తదితర అంశాలపై వినతి పత్రాలు అందజేశారు.
నియోజకవర్గానికో పార్కు ఏర్పాటుకు నిర్ణయించాం
ముందుగా ఖమ్మం జిల్లాలో యెండపల్లి, రెమిడిచర్లలో..
వీటి ద్వారా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు
కేంద్ర మంత్రి మాంఝీకి భట్టి విక్రమార్క విజ్ఞప్తి
యూరియా కోటాను వెంటనే సరఫరా చేయండి
కేంద్ర మంత్రులు నడ్డా, నిర్మలకు తుమ్మల విజ్ఞప్తి
వరంగల్‌లో చారిత్రక ఆలయాలకు నిధులు ఇవ్వండి
కేంద్ర మంత్రి షెఖావత్‌ను కోరిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు
ఢిల్లీ/హైదరాబాద్/ఖమ్మం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు. ఎంఎ్‌సఎంఈ పార్కులు, యూరియా, ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం తదితర అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎ్‌సఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల) పార్కు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, వీటికి ఆర్థిక సాయం అందించాలని ఆ శాఖ కేంద్ర మంత్రి జితన్‌రామ్ మాంఝీని భట్టి కోరారు. ఖమ్మం జిల్లా యెండపల్లి, రెమిడిచర్ల గ్రామాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన రెండు పార్కుల ప్రతిపాదనలు పంపడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. వీటి ద్వారా కనీసం 5 వేల మందికి ప్రత్యక్షంగా, 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. భట్టితో పాటు రాష్ట్ర పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ మల్లు రవి ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు.
తెలంగాణకు ఆగస్టు నెలలో రావాల్సిన యూరియా కోటా (1.7 లక్షల మెట్రిక్ టన్నుల)తో పాటు ఏప్రిల్ నుంచి జూలై వరకు కోత పెట్టిన యూరియా (2.1 లక్షల మెట్రిక్ టన్నుల)ను కూడా వెంటనే భర్తీ చేయాలని కోరారు. తుమ్మల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిసి క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని తిరిగి 44 శాతానికి పెంచాలని కోరారు. తుమ్మలతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రక ఆలయాలు, కాకతీయ వారసత్వ సంపదను పునరుద్ధరించాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌ను కోరారు. వేయి స్తంభాల గుడికి 75 కోట్లు, భద్రకాళి ఆలయంలో మహా మండప నిర్మాణానికి రూ.100 కోట్లు, వరంగల్ కోటలో ఉన్న 14 ఆలయాల పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని కోరారు. ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కూడా ఉన్నారు.