Tummala Nageshwar Rao: నీళ్లు ఇవ్వరు.. ప్రాజెక్టులూ కట్టుకోనివ్వరా?
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:14 AM
నీటి కేటాయింపుల్లో అన్యాయానికి వ్యతిరేకంగానే తెలంగాణ ఏర్పడిందని.. అలాంటి రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపడం తగదన్నారు. రాష్ట్రంలో రాజీవ్‌సాగర్/ఇందిరాసాగర్ ప్రతిపాదించిన చోటే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టారని, ఇప్పటిదాకా రూ.11వేల కోట్ల దాకా వ్యయం చేశారని తెలిపారు.

కేంద్రం తీరుపై మంత్రి తుమ్మల మండిపాటు
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో నీటి కేటాయింపులు చేయకుండా.. గోదావరిలో ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకుండా తెలంగాణను కేంద్రం ఇబ్బంది పెడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. నీటి కేటాయింపుల్లో అన్యాయానికి వ్యతిరేకంగానే తెలంగాణ ఏర్పడిందని.. అలాంటి రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపడం తగదన్నారు. రాష్ట్రంలో రాజీవ్‌సాగర్/ఇందిరాసాగర్ ప్రతిపాదించిన చోటే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టారని, ఇప్పటిదాకా రూ.11వేల కోట్ల దాకా వ్యయం చేశారని తెలిపారు. 36 టీఎంసీల నిల్వతో బ్యారేజీ కట్టుకోవడానికి, 240మెగావాట్ల దాకా జలవిద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అనుకూలత ఉందన్నారు. ఎన్‌జీటీ ఆదేశాల వల్ల పదేళ్లుగా దీని నిర్మాణం ముందుకెళ్లలేదని గుర్తు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖలో ఉన్న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో)కు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) గుర్తింపు ఏందని, సీడీవో డిజైన్లు తయారుచేశాక, మళ్లీ డిజైన్లు పరిశీలించాలని కేంద్రం మెలిక పెట్టడం తగదని అన్నారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు తక్షణమే సాంకేతిక అనుమతులు ఇవ్వాలని కోరారు.