Khelo India: తెలంగాణలో ‘ఖేలో ఇండియా గేమ్స్-2026’ నిర్వహించండి
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:07 AM
ఖేలో ఇండియా గేమ్స్- 2026’ క్రీడలను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయాకు మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రి మాండవీయాకు వాకిటి శ్రీహరి వినతి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): ’ఖేలో ఇండియా గేమ్స్- 2026’ క్రీడలను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయాకు మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఖేలో ఇండియా 8వ ఎడిషన్ కు రాష్ట్రం ఆతిఽథ్యం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరామని, గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశంపై ఆయనను కలిసిన విషయాన్ని గుర్తు చేశామని శ్రీహరి అన్నారు.
అలాగే, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో క్రీడా పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించారని, త్వరలో మూడురోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వస్తానని కేంద్రమంత్రి చెప్పినట్లు శ్రీహరి తెలిపారు.