Saudi Arabia: ఏడేళ్ల ఎడారి జీవితం సుఖాంతం
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:37 AM
ఉపాధి కోసం వెళ్లి ఏడేళ్లు సౌదీ అరేబియాలో చిక్కుకున్న హనుమకొండ జిల్లా వాసి కథ సుఖాంతమైంది. 2017లో సౌదీకి వలస వెళ్లిన భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామ గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్.
సౌదీ నుంచి నేడు హైదరాబాద్‌కు తాళ్లపల్లి ఈశ్వర్ రాక
పొన్నం చొరవతో సొంతూరికి హనుమకొండ జిల్లా వాసి
భీమదేవరపల్లి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం వెళ్లి ఏడేళ్లు సౌదీ అరేబియాలో చిక్కుకున్న హనుమకొండ జిల్లా వాసి కథ సుఖాంతమైంది. 2017లో సౌదీకి వలస వెళ్లిన భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామ గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్.. నాటి నుంచి అక్కడ ఓ ఖర్జూర తోటలో చిక్కుకున్నాడు. ఈశ్వర్‌ను స్వదేశానికి రప్పించాలని కోరుతూ.. ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి మార్గదర్శకత్వంలో ఈశ్వర్ భార్య లత, ఇద్దరు కూతుళ్లు గత జూన్ 27న హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ కౌంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు వినతిపత్రం అందజేశారు.
సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ ప్రత్యేక శ్రద్ధతో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు రియాద్‌లోని భారత ఎంబసీకి రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం లేఖలు రాసింది. గ్లోబల్ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు మహ్మద్ జబ్బార్.. భారత ఎంబసీతో సమన్వయం చేసి.. ఈశ్వర్ సొంతింటికి వెళ్లడానికి మార్గం సుగమం చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో సౌదీ నుంచి ఈశ్వర్ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. సొంతూరికి బయలుదేరుతూ భావోద్వేగానికి గురైన తాళ్లపల్లి ఈశ్వర్.. ‘ఏడున్నవే నా పల్లె.. నువ్వు ఏడున్నవే నా తల్లి.. నీ వొడిలోకి వస్తాను తల్లీ.. నన్ను సల్లంగ చూడు’ అంటూ పాడిన పాటను ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్‌కు అంకితమిచ్చారు.