Missing Person: 13 ఏళ్లుగా దుబాయ్‌లో భిక్షాటన
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:43 AM
ఉపాధి కోసం 13 ఏళ్ల క్రితం గల్ఫ్ వెళ్లిన తెలంగాణ వాసి ఒకరు ఆచూకీ లేకుండా పోయారు. దీంతో కుటుంబసభ్యులు అతడిపై ఆశలు వదులుకున్నారు. అయితే, దుబాయ్‌లో భిక్షాటన చేస్తున్న అతడితో కామారెడ్డి వాసి ఒకరు మాటలు కలిపారు.
పని కోసం వెళ్లి తప్పిపోయిన మెదక్ వాసి
ఇటీవల అతడిని కలిసిన కామారెడ్డి వ్యక్తి
రూ.లక్ష వెచ్చించి బాధితుడిని ఇంటికి పంపిన వైనం
వెల్దుర్తి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం 13 ఏళ్ల క్రితం గల్ఫ్ వెళ్లిన తెలంగాణ వాసి ఒకరు ఆచూకీ లేకుండా పోయారు. దీంతో కుటుంబసభ్యులు అతడిపై ఆశలు వదులుకున్నారు. అయితే, దుబాయ్‌లో భిక్షాటన చేస్తున్న అతడితో కామారెడ్డి వాసి ఒకరు మాటలు కలిపారు. ఈ క్రమంలో అతడిది మెదక్ అని తెలిసి స్థానికులకు సమాచారం అందించారు. దీంతో బాధితుడు సుదీర్ఘ కాలం తర్వాత స్వగ్రామానికి చేరుకున్నాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన కొనింటి కృష్ణ 13 ఏళ్ల క్రితం పని కోసం దుబాయ్ వెళ్లి తప్పిపోయాడు. ఉపాధి దొరక్క అక్కడ భిక్షాటన చేస్తూ ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు.
దుబాయ్‌లో భిక్షాటన చేస్తున్న కృష్ణతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి హనుమంత్‌రెడ్డి ఇటీవల మాట్లాడారు. తనది మెదక్ జిల్లా ఉప్పులింగాపూర్ అని చెప్పడంతో హనుమంత్‌రెడ్డి విషయాన్ని ఎమ్మెల్యే సునీతారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సునీతారెడ్డి ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన స్థానిక నాయకులతో మాట్లాడి కృష్ణ వివరాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో హనుమంత్‌రెడ్డి దుబాయ్ అధికారులతో మాట్లాడి, రూ.లక్షకుపైగా వెచ్చించి కృష్ణను ఉప్పులింగాపూర్‌కు పంపించారు. శుక్రవారం కృష్ణ స్వగ్రామానికి చేరాడు. కృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు హనుమంత్‌రెడ్డికి, ఎమ్మెల్యే సునీతారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.