Local Elections: రేపే జీవో విడుదల
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:36 AM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. ఓవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే..
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో
ఆపై ఎన్నికల సంఘానికి సర్కారు లేఖ.. వెంటనే ఎన్నికలకు షెడ్యూల్.. నోటిఫికేషన్
ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ.. సర్కారుకు చేరిన క్షేత్రస్థాయి వివరాలు
పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లు సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్ధం
శిక్షణకు సిద్ధంగా ఉండాలని సూచనలు.. సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులు
మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లు.. క్షేత్ర స్థాయిలో ఎన్నికల జోష్
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. ఓవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే.. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాల సేకరణ, సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆపై ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఆ తరువాత స్థానిక ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌లు వెలువడనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిజర్వేషన్లను ఖరారు చేయగా.. గ్రామ, మండల, జడ్పీటీసీల వారీగా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేస్తోంది. ఆయా కేంద్రాలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సామగ్రి, యంత్రాంగానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి జిల్లాల కలెక్టర్లు ఈ వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. మరోవైపు వార్డు సభ్యుల నుంచి జడ్పీ చైర్‌పర్సన్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలను ఆయా సామాజికవర్గాల శాతాన్ని బట్టి ఖరారు చేశారు. అయితే రిజర్వేషన్ల ఖరారుకు రెండు రోజులే సమయం ఇచ్చినందున.. తప్పొప్పులను సరిచూసుకునేందుకు ప్రభుత్వం బుఽధవారం వరకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఖరారైన రిజర్వేషన్లు, జనాభా, సామాజిక వర్గాల వారీగా ఎలా ఉన్నాయన్న అంశాలను జిల్లాల కలెక్టర్లు బుధవారం మరోసారి పరిశీలించారు. ఆ వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో భద్రపరిచి ఉంచగా.. ఒక సెట్‌ను బుధవారం రాత్రి ప్రభుత్వానికి అందజేశారు. వాటిని పంచాయతీరాజ్ శాఖ మరోసారి పరిశీలించనుంది. వాటన్నింటినీ క్రోడీకరించి గురువారం సాయంత్రానికి సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి అందించనుంది.
ప్రత్యేక జీవో విడుదలకు రంగం సిద్ధం..
పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్లకు సంబంధించిన సమగ్ర నివేదికలు అందడంతో ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులను జారీ చేయనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం 2018 పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణలతో ఈ జీవోను విడుదల చేయనుంది. ఇక ఎన్నికల నిర్వహణకు అవసరమైన శిక్షణకు కూడా సిద్ధంగా ఉండాలంటూ పంచాయతీరాజ్ శాఖ నుంచి జిల్లాల కలెక్టర్లకు, ఎంపీడీవోలు సహా ఇతర అధికార యంత్రాంగానికి బధవారం సాయంత్రం సందేశాలు వెళ్లాయి. మరోవైపు గ్రామాల వారీగా అవసరమైన బ్యాలెట్ బాక్సులు, అత్యవసరం కోసం వినియోగించేందుకు కూడా ఉండేలా బాక్సులను ఇప్పటికే మండలాలకు చేరవేసినట్టు సమాచారం. దీంతోపాటు ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు పంచాయతీరాజ్ శాఖ సూచించింది. అయితే నమూనా బ్యాలెట్ పత్రాలు కూడా మండలాలకు చేరాయని మండల అధికారుల ద్వారా తెలిసింది. ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై, నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక, ఖరారైన అభ్యర్థులను బట్టి వారికి కేటాయించిన గుర్తుల ప్రకారం బ్యాలెట్ పత్రాలను ముద్రించనున్నారు. వీటిని కూడా మండల, జిల్లాల వారీగా అందుబాటులో ఉన్నచోట ముద్రించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది.
మొదట ఏ ఎన్నికలు?
స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ల నుంచి అన్ని వ్యవహారాలను పూర్తి చేయడంతో.. మొదట ఏ ఎన్నికలు ఉంటాయనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని, ఆ తరువాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సర్పంచ్ ఎన్నికలు రెండు దశల్లో ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ప్రత్యేక జీవో విడుదలైన అనంతరం ఏ ఎన్నికలు మొదట నిర్వహిస్తారనేదానిపై స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థలకు తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తరువాత రెండో దశలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగించే అవకాశం ఉందంటున్నారు.
లోకల్ జోష్..
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండడంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్ మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్న ఆశావహులంతా రిజర్వేషన్ల ఖరారు అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మండల అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు తమ గ్రామం, మండలంలో ఏ సామాజికవర్గాలకు రిజర్వేషన్లను కేటాయించారనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో ఉన్న రిజర్వేషన్లు ఈ దఫా మారబోతున్నాయనే అంచనాలతో ఎవరికివారు తమకు ఈసారి అవకాశం వస్తుందో, రాదోనంటూ లెక్కలు వేసుకుంటున్నారు.