Share News

Organ Donation: ఆయుష్షు పోస్తున్న అవయవదానం

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:34 AM

కోమాలోకి వెళ్లిన ఒక విద్యార్థినికి.. 48 గంటల్లోగా కాలేయ మార్పిడి చేయకపోతే బతికే అవకాశాలు లేవన్నారు

Organ Donation: ఆయుష్షు పోస్తున్న అవయవదానం

  • రాష్ట్రంలో 12 ఏళ్లలో 6,309 అవయవ మార్పిళ్లు

  • 2024లో దేశంలోనే అగ్రస్థానం

  • తెలంగాణలో సగటున ప్రతి 10 లక్షల మందిలో 4.88 మంది దాతలు

  • జాతీయ సగటు.. కోటికి 8 మంది మాత్రమే

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కోమాలోకి వెళ్లిన ఒక విద్యార్థినికి.. 48 గంటల్లోగా కాలేయ మార్పిడి చేయకపోతే బతికే అవకాశాలు లేవన్నారు ఉస్మానియా వైద్యులు. కాలేయ దానానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినప్పటికీ.. వారిలో ఎవరి కాలేయమూ ఆమెకు సరిపోలలేదు. దీంతో ‘జీవన్‌దాన్‌’లో ‘సూపర్‌ అర్జంట్‌ కేటగిరీ’లో ఆమెకు ఓ బ్రెయిన్‌డెడ్‌ రోగి నుంచి సేకరించిన కాలేయాన్ని అమర్చారు. దీంతో ఆమె ఆరోగ్య పరిసితి మెరుగుపడింది. ఆ ఒక్క విద్యార్థినే కాదు.. ఇలా రాష్ట్రంలో ఏటా కొన్ని వందల మంది అవయవదానం కారణంగా మృత్యుకోరల నుంచి క్షేమంగా బయటపడుతున్నారు. తమ దైనందిన జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ‘జీవన్‌ దాన్‌’ ద్వారా గడిచిన 12 సంవత్సరాల్లో.. 1,673 మంది డోనర్ల నుంచి సేకరించిన 6,309 అవయవాలను, టిష్యూలను మార్పిడి చేయడం ద్వారా వైద్యులు వేలాది మందికి కొత్తజీవితాన్ని ప్రసాదించారు. అంతేనా.. తెలంగాణ రాష్ట్రం 2024లో అవయవదానంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆర్గనైజేషన్‌ అవార్డు అందుకుంది. అవయవదానం పట్ల ప్రజల్లో పెరిగిన అవగాహనే రాష్ట్రంలో అవయవదానాల సంఖ్య ఎక్కువగా ఉండడానికి కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన జీవన్‌దాన్‌లో భాగంగా అవయవదానం చేస్తున్నవారి జాతీయ సగటు 2024 లెక్కల ప్రకారం.. ప్రతి పది లక్షల మందికిగాను 0.8 మంది (అంటే ప్రతి కోటి మందిలో ఎనిమిది మంది) కాగా.. తెలంగాణలో ఆ రేటు ఏకంగా 4.88 (ప్రతి పదిలక్షల మందిలో దాదాపు ఐదుగురు)గా ఉండడం గమనార్హం.


కిడ్నీలు అత్యధికం

జీవన్‌దాన్‌ కార్యక్రమంలో భాగంగా గడిచిన 12 ఏళ్లలో అత్యధికంగా 2,516 మందికి కిడ్నీల మార్పిడి జరిగింది. ఇక.. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికే 464 అవయవమార్పిడి శస్త్రచికిత్సలు జరగ్గా.. 2024లో ఆ సంఖ్య 725గా, 2023లో 729గా ఉంది. జీవన్‌దాన్‌ ద్వారా కేవలం బ్రెయిన్‌డెడ్‌ రోగి నుంచే అవయవాలను సేకరిస్తారు. రక్తసంబంధీకులకు సంబంధించిన అవయవ దానాలను వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షిస్తుంది. ఏదైనా ఆస్పత్రిలో రోగి బ్రెయిన్‌ డెడ్‌ అయితే అతనికి సంబంధించి సమాచారం జీవన్‌దాన్‌కు చేరుతుంది. వెంటనే కో-ఆర్డినేటర్స్‌ ఆస్పత్రికి వెళ్లి రోగి పరిస్థితి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అవయదానం పరిస్థితి గురించి కుటుంబ సభ్యులకు వివరిస్తారు. అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించిన తర్వాత ఆ వివరాలను వెంటనే జీవన్‌దాన్‌ కమిటీకి అందజేస్తారు. ఈ కమిటీ అత్యవసరంగా అవయవాలు కావాల్సినవారిని గుర్తించి మార్పిడికి అవకాశమిస్తారు.

నిమ్స్‌లో నోడల్‌ కేంద్రం

తెలంగాణలో జీవన్‌దాన్‌కు సంబంధించి నోడల్‌ కేంద్రాన్ని నిమ్స్‌లో ఏర్పాటు చేశారు. దీనికి డీఎంఈ చైర్మన్‌గా, నిమ్స్‌ డైరెక్టర్‌ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి వర్గాలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. అలాగే కాలేయం, కిడ్నీ, గుండెకు సంబంధించిన కమిటీలు ఉంటాయి. ఈ కమిటీ పర్యవేక్షణలో అవయవ మార్పిడి కేటాయింపులు జరుగుతాయి. కాగా.. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రీ తప్పనిసరిగా జీవన్‌దాన్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. అలా నమోదైన ఆస్పత్రికే అవయవాలు కేటాయించి అక్కడే మార్పిడి నిర్వహిస్తారు. ఇలా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ప్రతి ఆస్పత్రిలో ఓ కో-ఆర్డినేటర్‌ను నియమించాల్సి ఉంటుంది. అవయవాలు అవసరమైన వారు ముందుగా తమ పేర్లను జీవన్‌దాన్‌లో నమోదు చేసుకోవాలి. బాధితులు 040-23489494 నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చు. ్జ్ఛ్ఛఠ్చిుఽఛ్చీుఽ.జౌఠి.జీుఽ అనే వెబ్‌సైట్‌ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

Updated Date - Aug 10 , 2025 | 04:34 AM