Land Value: భూముల మార్కెట్ విలువల పెంపు
ABN , Publish Date - May 21 , 2025 | 06:34 AM
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సలహా కమిటీ భేటీకి వచ్చిన ప్రతిపాదనలు ఆధారంగా త్వరలో సమగ్ర నివేదికను ప్రభుత్వం అందుకోనుంది.
పెంపుపై ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు సర్కారు ఆదేశం
పెంపుపై సలహా కమిటీ భేటీ
త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు పెరగనున్నాయా? పెంపుపై త్వరలోనే సర్కారు నిర్ణయం తీసుకోనుందా? అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. ఇటీవల ఉపముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో జరిగిన వనరుల సమీకరణ సమావేశంలో భూముల విలువ పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు. దీంతో రాష్ట్ర స్థాయిలో మార్కెట్ విలువల కేంద్ర మదింపు సలహా కమిటీ (సీవీఏసీ) సమావేశమై చర్చించింది. ఇప్పటికే ఓ ప్రైవేట్ ఏజెన్సీతో విలువ పెంపుపై అధ్యయనం చేయించిన ప్రభుత్వం.. ఆ నివేదిక ఆధారంగా ఆదాయాన్ని పెంచే మార్గాలను పరిశీలించాలని రిజిస్ట్రేషన్ శాఖకు సూచించింది. పలుదఫాలు సమావేశమైన అనంతరం అధికారులు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేశారు. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న విలువల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్న సర్కారు.. తాజాగా నివేదిక ఇవ్వాలని కోరడంతో పెంపు ఖాయమనే చర్చ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ చైర్మన్‌గా, జాయింట్ ఐజీ కన్వీనర్‌గా వ్యవహరించే సీవీఏసీకి కార్యదర్శిగా సీసీఎల్‌ఏ, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ భూముల మార్కెట్ విలువలను సమీక్షించి, అవసరమైన సిఫారసులతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఇందులో భాగంగానే మంగళవారం రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో సీవీఏసీ సమావేశమై మార్కెట్ విలువలపై చర్చించింది. మరోసారి సమావేశమై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.
ఏటా పెంచాలని సూచించిన ఏజెన్సీ
భూముల విలువలను ఏటా పెంచాలని, ఎంత పెంచాలనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని, పెంచే విలువలు శాస్త్రీయంగా ఉండాలని థర్డ్ పార్టీ ఏజెన్సీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. భూముల విలువల పెంపుపై ఇదివరకే రిజిస్ట్రేషన్ శాఖ అధ్యయనం చేసింది. ఆ నివేదికను కూడా ఏజెన్సీ పరిశీలించింది. అధికారులు తయారు చేసిన నివేదిక శాస్త్రీయంగా ఉందా లేదా? భూముల వాస్తవ ధరలకు, పుస్తక విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత? దాన్ని సవరించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శాస్త్రీయంగా పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు వంటి అంశాలపై ఏజెన్సీ తన అభిప్రాయాన్ని తెలియజేసింది.