Telangana High Court: ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉండాలి
ABN , Publish Date - Oct 24 , 2025 | 07:06 AM
రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉండాలే తప్ప, ఉద్యోగుల సర్వీసు విషయంలో తప్పించుకునే ధోరణి ప్రదర్శించరాదని.....
సర్వీసు క్రమబద్ధీకరణపై తప్పించుకునే ధోరణి తగదు
హైకోర్టు వ్యాఖ్య
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉండాలే తప్ప, ఉద్యోగుల సర్వీసు విషయంలో తప్పించుకునే ధోరణి ప్రదర్శించరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉద్యోగులను క్రమబద్ధీకరించే సమయంలో వారి తాత్కాలిక సర్వీసును సైతం లెక్కించాలని, అందుకు అనుగుణంగా పింఛను, ఇతర ప్రయోజనాలు చెల్లించాలని 2012లో అప్పటి ఉమ్మడి ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం సమర్థించాయి. అయినప్పటికీ ఆ ఉత్తర్వులను తమ విషయంలో అమలు చేయడం లేదంటూ ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఏకేసింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం.. సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును అమలు చేయకపోవడం ఆందోళనకరమని తెలిపింది. పిటిషనర్‌లు తెలంగాణ ప్రాంతంలోనే సర్వీసు చేసినందున 2012 నాటి ట్రైబ్యునల్ ఆదేశాలు అమలు చేయాలని సూచించింది.