Share News

High Court: విద్యార్థులకు హాజరు 65% ఉండాల్సిందే: హైకోర్టు

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:26 AM

విద్యార్థులకు కనీస హాజరు 65ు ఉండాల్సిందేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

High Court: విద్యార్థులకు హాజరు 65% ఉండాల్సిందే: హైకోర్టు

  • సింగిల్‌ జడ్జి ఆదేశాలను కొట్టేసిన డివిజన్‌ బెంచ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు కనీస హాజరు 65ు ఉండాల్సిందేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ప్రభుత్వ, యూనివర్సిటీ నిబంధనల ప్రకారం సాధారణంగా 75% హాజరుశాతం ఉండాలని, అనారోగ్య సమస్యలు, క్రీడల్లో పాల్గొనడం వంటి కారణాలతో 10% మినహాయింపు పొందవచ్చని తెలిపింది. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే నిబంధనలు రూపొందించారని, వాటిని మార్చి కోర్టులు తీర్పులు ఇవ్వలేవని స్పష్టం చేసింది. హాజరు శాతం తక్కువగా ఉందని గీతాంజలి ఇంజనీరింగ్‌ కాలేజీ ఓ విద్యార్థినిని పరీక్షలకు అనుమతించలేదు.


దీంతో ఆ విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి బెంచ్‌.. అనారోగ్య కారణంగా విద్యార్థిని హాజరు శాతం తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించొద్దని, పరీక్షలకు అనుమతించాలని ఆదేశాలు జారీచేసింది. దీనిపై కాలేజీ డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది. ఈ అప్పీల్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత కేసులో విద్యార్థికి అనుమతిస్తే.. హాజరుశాతం తక్కువ ఉన్న విద్యార్థులంతా న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు అవకాశం ఇచ్చినట్లవుతుందని వ్యాఖ్యానించింది. యూనివర్సిటీ నిబంధనల్లో జోక్యం చేసుకోలేం అంటూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది.

Updated Date - Aug 07 , 2025 | 04:26 AM