Medicine Purchase: ఏడాదిలో 55 కోట్ల బీపీ, షుగర్ మాత్రలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:23 AM
అక్షరాలా 55,69,98,087 టాబ్లెట్లు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే అధిక రక్తపోటు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగం.. అన్ని మాత్రలు కలిపి 228 కోట్ల మేర కొనుగోలు
టీజీఎంఎ్‌సఐడీసీ వార్షిక నివేదిక
రాష్ట్రంలో 41 లక్షల మందికిపైగా అధిక రక్తపోటు, మధుమేహం బాధితులు
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): అక్షరాలా 55,69,98,087 టాబ్లెట్లు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే అధిక రక్తపోటు, మధుమేహ బాధితుల కోసం ఒక్క ఏడాదిలో ప్రభుత్వం ప్రభుత్వం కొనుగోలు చేసిన మాత్రల సంఖ్య ఇది. మొత్తంగా కొనుగోలు చేసిన అన్నిరకాల మాత్రల్లో ఇవే 25శాతం ఉండటం గమనార్హం. రాష్ట్రంలో అధిక రక్తపోటు, మధుమేహం బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతోందనేందుకు ఇదే సాక్ష్యం. ఇక బీపీ, షుగర్ మాత్రల తర్వాత అధికంగా విటమిన్లు, పారాసిటమాల్ మాత్రలు వినియోగం అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
మొత్తం 232 కోట్ల మాత్రల కొనుగోలు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే అన్ని రకాల ఔషధాలను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎ్‌సఐడీసీ) ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తారు. ఏటా సుమారు రూ.500 కోట్ల విలువైన ఔషధాలు సేకరిస్తారు. గతేడాది జూలై 1 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు కొనుగోలు చేసిన ఔషఽధాలు, వ్యాక్సిన్స్, సర్జికల్స్ వివరాలతో టీజీఎంఎ్‌సఐడీసీ తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందించింది. మొత్తం 522 రకాల ఔషధాలను కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది. అందులో 284 రకాలు అత్యవసరమైన మందుల జాబితా (ఈఎంఎల్)లో, మరో 238 రకాల ఔషధాలు అదనపు మందుల జాబితా (ఏఎంఎల్) జాబితాలో ఉంటాయి. టీజీఎంఎస్‌ఐడీసీ గత ఏడాది కాలంలో అన్ని రకాలు కలిపి 232,48,63,500 మాత్రలు కొనుగోలు చేసింది. ఇందులో అధిక రక్తపోటు, మధుమేహానికి సంబంధించిన మాత్రలే 55 కోట్లు.. ఇందులో అధిక రక్తపోటుకు సంబంధించి 30,67,32,002 (టెల్మా, అమ్లోడిపిన్ తదితర) మాత్రలు, మరో 25 కోట్ల మేర మధుమేహం(మెట్‌ఫార్మిన్, గ్లిమెపిరైడ్ తదితర) మాత్రలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఫార్మసీలలో వేగంగా ఖాళీ అవుతున్న మందుల జాబితాలో తొలిస్థానంలో ఇవే ఉన్నాయని.. తర్వాత విటమిన్ మాత్రలు, పారాసిటమాల్ ఉన్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఔషఽధ కొనుగోలు కోసం ఏటా రూ.500 కోట్లు ఖర్చు చేస్తోంది.
రాష్ట్రంలో 41.82 లక్షల మంది బీపీ, షుగర్ బాధితులు
ప్రభుత్వం రాష్ట్రంలో 30 ఏళ్లుపైబడిన వారికి అసాంక్రమిక, దీర్ఘకాలిక (ఎన్‌సీడీ) వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేస్తోంది. ప్రధానంగా బీపీ, షుగర్ పరీక్షలు చేసి, వారికి ఉచితంగా ఔషధాలను అందిస్తోంది. ఈ పరీక్షల నివేదిక మేరకు.. రాష్ట్రంలో అధిక రక్తపోటు, మధుమేహ బాధితులు 41,82,484 మంది ఉన్నారు. ఇందులో బీపీ బాధితులు 27,49,066 మంది, 14,33,418 మంది షుగర్ బాధితులు. రాష్ట్రంలో 30ఏళ్లుపైబడిన వారు 1.73 కోట్ల మంది ఉండగా... ఇప్పటివరకు 1.31 కోట్ల మందికి ఎన్‌సీడీ పరీక్షలు చేసినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. అంటే పరీక్షలు చేయించుకున్న వారిలో 31.92 శాతం మంది ఏదో ఒక స్థాయిలో బీపీ, షుగర్‌తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. అధిక రక్తపోటు బాఽధితుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్, కామారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో ఉన్నారు. మధుమేహ బాధితుల సంఖ్యలోనూ హైదరాబాద్ అగ్రభాగాన నిలిచింది. మరోవైపు అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నట్టు గుర్తించిన బాధితుల్లో చాలా మంది కొంతకాలం ఔషధాలు వాడి, ఆ తర్వాత ఆస్పత్రులకు రావడం లేదని వైద్యవర్గాలు తెలిపాయి. 27.49 లక్షల మంది బీపీ బాధితుల్లో నిత్యం మందులు వాడుతున్నది 10.70 లక్షల మందేనని.. 14.33 లక్షల మంది మధుమేహ బాధితుల్లో క్రమం తప్పకుండా మందులు తీసుకుంటున్నవారు 5.70 లక్షల మందేనని వైద్యశాఖ ఇటీవల సర్కారుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. మందులు సరిగా వాడని వారిని గుర్తించి, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందిని వైద్యశాఖ ఆదేశించింది.