Governor BC Reservation: బీసీలకు రిజర్వేషన్ ఆర్డినెన్స్‌పై న్యాయసలహా!
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:54 AM
రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయసలహా కోరినట్టు తెలిసింది.
అధికారులతో చర్చించిన తర్వాత కోరిన గవర్నర్
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయసలహా కోరినట్టు తెలిసింది. రిజర్వేషన్ అమలుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ఫైలులో కదలిక వచ్చింది. ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో అధికారులతో శుక్రవారం చర్చించినట్టు సమాచారం. అంతేకాక, ఈ ఆర్డినెన్స్, రిజర్వేషన్ అంశాలపై గవర్నర్ న్యాయ సలహా కోరినట్టు తెలిసింది.
రిజర్వేషన్లు, వాటి అమలుకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పలు వివరాలు తీసుకోవాలని సంబంధిత అధికారులను గవర్నర్ ఈ సందర్భంగా ఆదేశించినట్టు సమాచారం. అలాగే, ప్రభుత్వం సవరణకు ప్రతిపాదించిన పంచాయతీ రాజ్ చట్టం-2018లోని సెక్షన్ 285 (ఏ)పై కూడా గవర్నర్ ఆరా తీసినట్టు తెలిసింది. కాగా, ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం లభిస్తే చట్ట సవరణ అమలులోకి రానుంది.