Share News

Deputy CM Bhatti Vikramarka: పంచాయతీ సచివాలయం దాకా సౌర విద్యుత్‌ ప్లాంట్లు

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:37 AM

రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు చర్యలు ముమ్మరం చేసింది.

Deputy CM Bhatti Vikramarka: పంచాయతీ సచివాలయం దాకా సౌర విద్యుత్‌ ప్లాంట్లు

  • పెద్దఎత్తున సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి చర్యలు

  • వేగిరంగా ‘ఇందిర సౌర గిరిజల వికాసం’

  • కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. గ్రామపంచాయతీ నుంచి సచివాలయం వరకూ అన్ని ప్రభుత్వ భవనాల మిద్దెలపై సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్లాంట్ల ఏర్పాటుతో పెద్ద ఎత్తున సౌర విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. అలాగే ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం అమలును వేగిరం చేయాలన్నారు. అటవీ హక్కుల రక్షణ చట్టం (ఆర్‌ఓఎ్‌ఫఆర్‌) కింద రైతులు పట్టాలు పొందిన భూముల వివరాలను పంపాలని ఏజెన్సీ ప్రాంత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్‌ఓఎ్‌ఫఆర్‌ భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం అమలుపై జిల్లా కలెక్టర్లతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీతో కలిసి సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల భవనాలపైనా సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన వివరాలనూ పంపాలని కలెక్టర్లను మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. పార్కింగ్‌, క్యాంటిన్లతోపాటు కలెక్టరేట్‌ కార్యాలయాల ప్లాన్లను హైదరాబాద్‌కు పంపాలని సూచించారు. కలెక్టరేట్లన్నీ ఒకే నమూనాలో నిర్మించినందున సౌర విద్యుత్‌ ప్లాంట్‌ డిజైన్‌ కూడా హైదరాబాద్‌ నుంచే పంపుతామన్నారు. సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన వివరాలను వారం లోపు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయంలో సమర్పించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నీటి పారుదల, రోడ్లు భవనాల శాఖల పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్న స్థలాల వివరాలనూ అందించాలని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్‌ఓఎ్‌ఫఆర్‌ చట్టం కింద పట్టాలు పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల భూముల్లో ‘నల్లమల డిక్లరేషన్‌’ అమలు చేస్తున్నామన్న మల్లు భట్టి విక్రమార్క.. ఆ భూముల్లో కింద ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ద్వారా ఉచిత సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్లకు వివరించారు. అచ్చంపేటలో ప్రారంభమైన నల్లమల డిక్లరేషన్‌.. త్వరలోనే ఆదిలాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం అమలుకు అవసరమైన వివరాలను అలసత్వం లేకుండా వారం లోపు అందజేయాలని ఆయన చెప్పారు. ఈ విషయంలో సందేహాలుంటే ఇంఽధనశాఖ ముఖ్యకార్యదర్శి, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎండీలు, రెడ్‌కో వీసీఎండీని సంప్రదించాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లను ఆదేశించారు.

Updated Date - Aug 10 , 2025 | 04:37 AM