Share News

అంబేడ్కర్‌ అంతర్జాతీయ పరిశోధన కేంద్రం

ABN , Publish Date - May 25 , 2025 | 04:18 AM

డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘‘అంబేడ్కర్‌ అంతర్జాతీయ పరిశోధన కే ంద్రం’’ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో దీన్ని నిర్మించనున్నారు.

అంబేడ్కర్‌ అంతర్జాతీయ పరిశోధన కేంద్రం

  • హైదరాబాద్‌లో 2 ఎకరాల్లో స్థాపన

హైదరాబాద్‌ సిటీ, మే 24 (ఆంధ్రజ్యోతి) : డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘‘అంబేడ్కర్‌ అంతర్జాతీయ పరిశోధన కేంద్రం’’ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో దీన్ని నిర్మించనున్నారు. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ ఘంటా చక్రపాణి రూపొందించి సమర్పించిన ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సంస్థ ఏర్పాటుకు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి నిధులు ఎస్సీ సబ్‌ప్లాన్‌ నుంచి రూ.100 కోట్లు మంజూరు చేసింది. అంబేడ్కర్‌ స్ఫూర్తిని ఆధారంగా చేసుకొని ఈ కేంద్రం సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ప్రపంచస్థాయిలో చర్చలు, పరిశోధనలకు వేదికగా నిలువనుందని వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి శనివారం తెలిపారు.


సీఎం రేవంత్‌రెడ్డికి, రూ.100 కోట్ల నిధులు ఎస్సీ సబ్‌ప్లాన్‌ నుంచి మంజూరు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఽకృతజ్ఞతలు తెలిపారు. అంబేడ్కర్‌ అంతర్జాతీయ కేంద్రం దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల సమస్యలపై లోతైన అధ్యయనానికి, అంతర్జాతీయ ప్రమాణాల పరిశోధనకు కేంద్రంగా పని చేయనుంది. అంబేడ్కర్‌ అంతర్జాతీయ ‘ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌’ పేరుతో ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఆరుగురు విద్యార్థులకు పూర్తిస్థాయి ఉపకార వేతనం ఇస్తారు. వీరు డా.అంబేడ్కర్‌ విద్యనభ్యసించిన కొలంబియా’ విశ్వవిద్యాలయం, ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశాన్ని కల్పించనుంది. జూబ్లీహిల్స్‌ దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ సమీపంలోని 2 ఎకరాల భూమిలో ఈ కేంద్రాన్ని స్థాపించనున్నారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - May 25 , 2025 | 04:18 AM