Share News

DA Hike: ప్రభుత్వోద్యోగులకు త్వరలో తీపి కబురు?!

ABN , Publish Date - May 24 , 2025 | 03:52 AM

త్వరలో ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించనున్నది. ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికే అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కారు.. కొన్ని డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినట్లు సమాచారం.

DA Hike: ప్రభుత్వోద్యోగులకు త్వరలో తీపి కబురు?!

  • పెండింగ్‌ బకాయిల చెల్లింపు

  • ఒక డీఏ విడుదలతోపాటు ఆరోగ్య పథకం వెల్లడి

  • రాష్ట్ర అవతరణ దినోత్సవాన అధికారిక ప్రకటన

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): త్వరలో ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించనున్నది. ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికే అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కారు.. కొన్ని డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినట్లు సమాచారం. రిటైర్డు ఉద్యోగుల బెనిఫిట్లతోపాటు పెండింగ్‌ బకాయిల చెల్లించడానికి ముందుకొచ్చినట్లు వినికిడి. ఇక ఒక డీఏ, ఆరోగ్య పథకం ప్రకటించే అవకాశాలున్నాయి. సత్వరం ఆర్థికేతర డిమాండ్లను నెరవేర్చడానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనున్నదని ఉద్యోగ సంఘాల వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న 5 డీఏల్లో 2 డీఏలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టు బడుతున్నా.. ఒక డీఏ విడుదలకు సర్కారు సుముఖత వ్యక్తం చేసినట్లు ఉద్యోగుల కథనం.


అలాగే ఉద్యోగుల కోరిక మేరకు ఆరోగ్య పథకం ప్రకటించడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలియవచ్చింది. కాగా ఉద్యోగ సంఘాల నేతలు ఒక్కటిగానే ఉండాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల సూచనలతో మారం జగదీశ్వర్‌ నేతృత్వంలోని ఉద్యోగ సంఘాల జేఏసీలో లచ్చిరెడ్డి సారధ్యంలోని ఉద్యోగ సంఘాల జేఏసీ విలీనానికి సిద్ధమైనట్లు వినికిడి. ఈ మేరకు ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే ఇరు పక్షాల నేతల మధ్య జరిగిన చర్చలు ముగిశాయని, వారం రోజుల్లో ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి.. రెండు జేఏసీల విలీనంపై ప్రకటన చేస్తారని సమాచారం.

Updated Date - May 24 , 2025 | 03:52 AM