Paddy Procurement Targets: యాసంగిలో 127.50లక్షల టన్నుల ధాన్యం దిగుబడి
ABN , Publish Date - Apr 20 , 2025 | 05:56 AM
యాసంగిలో 127.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, 70.13 లక్షల టన్నులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. 8,329 కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు చేసిన మంత్రి ఉత్తమ్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్ కూడా అందిస్తున్నట్టు తెలిపారు
రాష్ట్ర ప్రభుత్వం అంచనా..
70.13లక్షల టన్నులు కొనాలని లక్ష్యం
8,329 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు!
మొదలైన ధాన్యం కొనుగోళ్లు..
కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ సమీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఈ యాసంగిలో దాదాపు 127.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఇందులో 70.13లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. యాసంగిలో 57లక్షల ఎకరాల్లో రైతులు వరిపంట వేశారని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. శనివారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయం నుంచి శాఖ ముఖ్య కార్యదర్శి చౌహన్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆదిలాబాద్ నుంచి మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు, ఇందులో ఇప్పటికే 7,337 కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 8.51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని చెప్పారు. ఇందులో 5.77 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇందులో సన్నరకం 3.79 లక్షల టన్నులు, దొడ్డు రకం 1.98 లక్షల టన్నులు ఉందన్నారు. సన్నధాన్యం రైతులకు బోనస్ రూ.500(క్వింటాల్‌కు) ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని ఉత్తమ్ చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోదాముల్లో 25లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అవకాశం ఉందని, మిగిలిన ధాన్యం నిల్వ కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, ప్రైవేట్ గోదాముల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సన్నాలకు రూ.500 రూపాయల బోనస్ ఇస్తుండటంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా వచ్చే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో చెక్‌పోస్టుల దగ్గర సీసీటీవీ కెమెరాలతో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని ఉత్తమ్ చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం అమలుచేస్తున్న సన్న బియ్యం పంపిణీలో 25ు నూకలు ఉండటం భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ) నిబంధనల్లో భాగమేనని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం లక్ష టన్నుల ధాన్యం ఎగుమతి చేయాల్సి ఉండగా, మొదటి దశలో 12,500 టన్నులు పంపించామని చెప్పారు. ఈ సంవత్సరం తెలంగాణలో వానాకాలం, యాసంగి.. రెండు సీజన్‌లలో కలిపి 281 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని, ఇదొక రికార్డు అని ఉత్తమ్ తెలిపారు.