Fish Seed Distribution: జిల్లాల వారీగా చేప పిల్లల పంపిణీకి టెండర్లు
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:20 AM
మత్స్యకారులకు ఉపాధి నిమిత్తం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రూ.93.62కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,326 నీటి వనరుల్లో 84.62 కోట్ల చేప పిల్లలు పోసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 26,326 నీటి వనరుల్లో 84.62 కోట్ల చేపపిల్లలు వేసేందుకు ఏర్పాట్లు
ప్రతిపాదిత అంచనా వ్యయం రూ.93.62 కోట్లు
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారులకు ఉపాధి నిమిత్తం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రూ.93.62కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,326 నీటి వనరుల్లో 84.62 కోట్ల చేప పిల్లలు పోసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, అక్టోబరులోగా ఉచిత చేప పిల్లల పంపిణీ, చెరువుల్లో పోసే కార్యక్రమం చేపట్టేందుకు మత్స్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు టెండర్ల నోటిఫికేషన్ ఈ నెల 18నే జారీ కాగా, 20వ తేదీ ఉదయం నుంచీ టెండరు బిడ్ల స్వీకరణ ప్రారంభమైంది. సెప్టెంబరు ఒకటో తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ బిడ్లు స్వీకరిస్తారు.
అదేరోజు మూడున్నర గంటలకు టెండర్ బిడ్లు తెరుస్తారు. ఈ మేరకు జిల్లాల వారీగా బిడ్ డాక్యుమెంట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ టి. శ్రీనివాస్ తెలిపారు. 35-40 మిల్లీమీటర్ల సైజులో ఉండే లక్ష చేప పిల్లలకు రూ. 62,670 చొప్పున, 80-100 మిల్లీమీటరు సైజులో ఉండే లక్ష చేప పిల్లలకు రూ.1,66,130 చొప్పున ప్రతిపాదిత వ్యయం నిర్ణయించినట్లు వెల్లడించారు.