Life Tax: కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంపు!
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:02 AM
రాష్ట్రంలో కొత్త వాహనాలపై జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలకు సగటున మూడు శాతం మేర పన్నులను పెంచింది.
ఎక్స్‌షోరూం ధరను బట్టి శ్లాబుల మార్పు
ద్విచక్ర వాహనాలకు 3 శ్లాబుల్లో..
కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలకు ఐదు శ్లాబుల్లో పన్ను
తక్కువ ధర వాహనాలపై పడని ప్రభావం
ఖరీదైన వాహనాలపై అధిక పన్ను విధింపు
నేటి నుంచే అమల్లోకి.. 2 వేల కోట్ల వరకు
అదనపు రాబడి.. అధికారుల అంచనా
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త వాహనాలపై జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలకు సగటున మూడు శాతం మేర పన్నులను పెంచింది. గురువారం నుంచే పెరిగిన పన్నులు అమల్లోకి వస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికా్‌సరాజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ మోటారు వాహనాల పన్నుల చట్టం-1963 ప్రకారం వాహనాల జీవితకాల పన్నుల్లో మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. కాగా కొత్త శ్లాబుల ప్రకారం ఎక్స్ షోరూం ధర రూ.లక్ష లోపు ఉండే ద్విచక్రవాహనాలపై.. రూ.10 లక్షల లోపు ధర ఉండే కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలపై పన్ను పెంపు ప్రభావం ఉండటం లేదు. ఆపైన ధర ఉండే వాహనాలకు సంబంధించి కొత్తగా శ్లాబులు నిర్ణయించి, ఎక్కువ పన్నులను నిర్ధారించారు. రాష్ట్ర రవాణా శాఖకు వచ్చే ఆదాయంలో సుమారు 70శాతం జీవితకాల పన్నుల నుంచే సమకూరుతోంది. తాజా పన్నుల పెంపుతో అదనంగా రూ. 2 వేల కోట్ల వరకు ఆదాయం రావొచ్చని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్త పన్నులు.. భారం ఇలా..!
ఇప్పటివరకు ద్విచక్ర వాహనాలకు రెండు శ్లాబుల్లో.. ఎక్స్ షోరూం ధర రూ.50 వేల వరకు ఉంటే 9ు, రూ. 50 వేలకంటే ఎక్కువైతే 12ు జీవితకాల పన్ను వసూలు చేశారు. తాజాగా నాలుగు శ్లాబులకు పెంచారు.
రూ.50 వేల వరకు ధర ఉన్నవాటికి 9శాతమే కొనసాగించారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు 12శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 15శాతం, రూ.2 లక్షలపైన ధర ఉన్నవాటికి 18 శాతం జీవిత పన్నుగా నిర్ణయించారు.
వ్యక్తిగత కార్లు, త్రీ వీలర్లు, ఇతర వాహనాలకు ఇప్పటివరకు నాలుగు శ్లాబుల్లో.. రూ.5లక్షల లోపు ధర ఉంటే 13శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ధర ఉంటే 14 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ధర ఉంటే 17శాతం, రూ.20 లక్షలపైన ధర ఉన్న వాహనాలపై 18శాతం పన్ను వసూలు చేశారు. ఇప్పుడు ఐదు శ్లాబులకు పెంచారు.
రూ.5 లక్షలలోపు 13ు, 5 లక్షల నుంచి రూ.10 లక్షల వాహనాలకు 14ు పన్నులను యథాతథంగా కొనసాగించారు. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ధర ఉంటే 18ు, రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన వాహనాలకు 20ు, రూ.50 లక్షల కంటే ఖరీదైన వాహనాలకు 21ు జీవితకాల పన్నుగా నిర్ణయించారు.