Share News

29న ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తాం: భట్టి

ABN , Publish Date - May 28 , 2025 | 05:19 AM

ఉద్యోగుల సమస్యలపై మే 29న ముఖ్యమైన సమావేశం జరుగనుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రూ.11 వేల కోట్ల బకాయిలు చెల్లింపు, ఆరోగ్య పథకం వంటి అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది.

29న ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తాం: భట్టి

  • రూ.11 వేల కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారు

  • భట్టితో సమావేశం తర్వాత ఉద్యోగుల జేఏసీ వెల్లడి

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 29న సమావేశాన్ని నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, పంచాయత్‌రాజ్‌ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌లతో ప్రభుత్వం సబ్‌-కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే..! ఉద్యోగులు లేవనెత్తిన సమస్యల గురించి సబ్‌-కమిటీ అధికారులు మంగళవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంకు వివరించారు. 29న సబ్‌-కమిటీ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు, వాటి పరిష్కారంపై చర్చిస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలిపారు. కాగా.. భట్టితో భేటీ తర్వాత ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ‘‘ఉద్యోగులకు రూ.11 వేల కోట్ల బకాయిలు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స)ను ప్రకటిస్తామన్నారు. ఐదు డీఏలలో ఒకటి లేదా రెండింటిని అందజేస్తామని చెప్పారు’’ అని వివరించారు. జూన్‌ 2న సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేస్తారని వెల్లడించారు. కాగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

Updated Date - May 28 , 2025 | 05:20 AM