Share News

Telangana Farmers: గాలివాన బీభత్సం

ABN , Publish Date - Apr 11 , 2025 | 03:38 AM

రాష్ట్రంలో గాలివాన మరియు వడగండ్ల వాన వలన పంటలకు భారీ నష్టం జరిగింది. రైతులు తడిసిన ధాన్యం, మొక్కజొన్నతోపాటు పంటలపై తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు

Telangana Farmers: గాలివాన బీభత్సం

  • తడిసిన ధాన్యం రాశులు.. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న

  • పలుచోట్ల వండగండ్ల వాన.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి

  • విద్యుత్తుకు అంతరాయం.. మరో రెండు రోజులు వర్షాలు!

  • అధికారులూ అప్రమత్తంగా ఉండండి.. సీఎం ఆదేశం

  • ములుగు జిల్లాలో ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

  • పంట నష్టపోయి ఒకరు.. అప్పుల ఒత్తిడికి మరొకరు..

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యం, ఇతర పంటలు తడిసిపోయాయి. మంగళవారం కూడా గాలివానతో పంటలకు నష్టం వాటిల్లింది. పగబట్టినట్లు గురువారం మరోసారి విరుచుకుపడింది. జనగామ, నల్లగొండ జిల్లాల్లో ఓ రైతు, గొర్రెల కాపరి పిడుగుపాటుకు మృతిచెందారు. హైదరాబాద్‌లో ఈదురుగాలుల ధాటికి చెట్లు కూలిపోయాయి. హోర్డింగులు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం వరకు ఎండ మాడ్చేయగా... సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారిపోయింది. గాలివాన మొదలై.. రైతులకు కడగండ్లు మిగిల్చింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడ, నవీపేట, మోస్రా, ఎడపల్లి, నిజామాబాద్‌ పట్టణం, రూరల్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కల్లాల్లో ఉన్న ధాన్యం, జొన్న, మొక్కజొన్నతోపాటు నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులోనూ పసుపు తడిసిపోయింది. పెంచికల్‌పాడ్‌ గ్రామంలో వడగళ్ల వాన కురవడంతో ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతో పాటు కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. కోనరావుపేట, మంగళ్లపల్లె, అనంతగిరి, బొల్లారంలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో మార్కెట్‌ యార్డ్‌లో ధాన్యం తడిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మార్కెట్‌ యార్డులో ధాన్యం రాశులు తడిసిపోవడంతో నీటిని తొలగించేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం అమలూరులో ఉరుములు, మెరుపులతో చెట్టు కిందకు వెళ్లిన గొర్రెల కాపరి మేకల చిన్న రాములు (60) పిడుగుపాటుకు మృతిచెందాడు. నల్లగొండ, దేవరకొండల్లో వర్షంతో ప్రధాన వీధులు జలమయమయ్యాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. వరి, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్దలో రైతు వేదిక పైకప్పు ఎగిరి కింద పడింది. పిడుగుపాటుకు మెదక్‌ జిల్లా జగ్గంపేట గ్రామ పంచాయతీపై విద్యుత్‌ వైర్లు కాలిపోయాయి. మెదక్‌ పట్టణంలో చెట్ల కొమ్మలు తీగలపై పడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లాలో 10 వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన మందాడి రవీందర్‌ రెడ్డి (63) అనే రైతు పశువులను మేపేందుకు వెళ్లి పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో భారీ వృక్షాలు, హోర్డింగులు నేలకూలాయి. మధురానగర్‌లో భారీ వృక్షం తీగలపై పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గోల్కొండ చౌరస్తాలో హోర్డింగ్‌ విరిగిపోయింది. మల్కాజిగిరి, హఫీజ్‌పేట, హిమాయత్‌ నగర్‌, రామచంద్రాపురం, లింగంపల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో మరో రెండు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

అకాల వర్షాలతో పంట కోల్పోయిన ఓ రైతు, అప్పు కట్టాలని ఎరువుల వ్యాపారి ఒత్తిడి చేయడంతో మరో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు మొట్లగూడెం గ్రామానికి చెందిన యాలం నర్సింహారావు గత ఏడాది 6 ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. దిగుబడి రాకపోవడంతో రూ.10 లక్షల అప్పుల పాలయ్యాడు. ఈసారి తనకున్న ఐదెకరాలతో పాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. వరి, మొక్కజొన్న, మిర్చి సాగు చేశాడు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కోత దశలో ఉన్న పంటంతా నాశనమైంది. దీంతో నర్సింహారావు గురువారం ఉదయం పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వాజేడు మండలం ధర్మవరానికి చెందిన బొగట నర్సింహారావు మిర్చి పంట సాగు కోసం ఓ వ్యాపారి వద్ద అప్పుగా రూ.90 వేల విలువైన ఎరువులు, పురుగు మందులు తెచ్చుకున్నాడు. బుధవారం సాయంత్రం మిర్చిని మార్కెట్‌కు తరలిస్తుండగా తన డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చిన వ్యాపారి బస్తాలను బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన నర్సింహారావు పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆయన ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Updated Date - Apr 11 , 2025 | 03:39 AM