Electricity Tariff: రాత్రి కరెంట్ వాడితే రాయితీల్లేవ్!
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:33 AM
రాత్రిపూట డిమాండ్ ఉండని సమయంలో కరెంట్‌ను వినియోగించే హైటెన్షన్(హెచ్‌టీ)లోని కొన్ని కేటగిరీలకు ఇస్తున్న రాయితీని ఎత్తివేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) నిర్ణయించాయి.
హెచ్‌టీలో కొన్ని కేటగిరీలకు ఇస్తున్న రాయితీ ఎత్తివేతకు డిస్కమ్‌ల నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాత్రిపూట డిమాండ్ ఉండని సమయంలో కరెంట్‌ను వినియోగించే హైటెన్షన్(హెచ్‌టీ)లోని కొన్ని కేటగిరీలకు ఇస్తున్న రాయితీని ఎత్తివేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) నిర్ణయించాయి. ఈమేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ)లో పిటిషన్ దాఖలు చేశాయి. హెచ్‌టీ-1 (ఏ) ఇండస్ట్రీ జనరల్, హెచ్‌టీ-1(ఏ) పౌలీ్ట్ర ఫామ్స్, హెచ్‌టీ-2(ఏ) ఇతరులు, హెచ్‌టీ-2(బీ) పూర్తిగా మతపరమైన సంస్థలు, హెచ్‌టీ-3లోని ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, హెచ్‌టీ-9 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కరెంట్ వాడితే ప్రతి యూనిట్‌కు రూ.1.50 రాయితీ ఇస్తూ ఈఆర్‌సీ టారిఫ్ ఆర్డర్ ఇచ్చింది.
దీన్ని సవరించి రాయితీని ఎత్తివేయాలని కోరుతూ డిస్కమ్‌లు పిటిషన్ వేశాయి. ఇక ఉదయం 6 నుంచి 10 గంటల దాకా, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల దాకా పీక్ డిమాండ్ ఉన్న సమయంలో విద్యుత్‌ను ఆయా కేటగిరీ వినియోగదారులు వాడితే ఈఆర్‌సీ ఖరారు చేసిన టారి్‌ఫకన్నా అదనంగా యూనిట్‌కు రూ.1 వసూలు చేస్తుండగా దీన్ని యథాతథంగా కొనసాగించనున్నారు. రాత్రిపూట బహిరంగ విపణిలో (ఎనర్జీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా-ఐఈఎక్స్) కరెంట్ ధరలు యథాతథంగా ఉన్నందున రాయితీ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి. .