Share News

Srisailam project: శ్రీశైలం ఉన్నది నీటి మళ్లింపునకు కాదు

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:53 AM

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందే జల విద్యుదుత్పాదన కోసం అని, నీటి మళ్లింపునకు కాదని తెలంగాణ స్పష్టం చేసింది.

Srisailam project: శ్రీశైలం ఉన్నది నీటి మళ్లింపునకు కాదు

  • 1954 ఒప్పందానికి విరుద్ధంగా ఆంద్రప్రదేశ్‌లో పెరిగిన ఆయకట్టు

  • కృష్ణా ట్రైబ్యునల్‌లో తెలంగాణ వాదన

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందే జల విద్యుదుత్పాదన కోసం అని, నీటి మళ్లింపునకు కాదని తెలంగాణ స్పష్టం చేసింది. 1976-77లో అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం లైన్ట్‌ కెనాల్‌ ద్వారా 1500క్యూసెక్కుల చొప్పున ఏటా 15 టీఎంసీలు తరలించాల్సి ఉండగా ఆ ఒప్పందాన్ని ఏపీ ఉల్లంఘించి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, శ్రీశైలం కుడి కాల్వ, బనకచ ర్ల క్రాస్‌ రెగ్యులేటరీలు తెచ్చిందని ఆక్షేపించింది. 1980లో శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి 11,150క్యూసెక్కులు తరలించే సామర్థ్యం ఉండగా, 2020 నాటికి 88వేల క్యూసెక్కులకు పెంచారని నివేదించింది. కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచడానికి జరుగుతున్న విచారణలో భాగంగా గురువారం కృష్ణా ట్రైబ్యునల్‌-2(జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌)లో తెలంగాణ వాదనలు వినిపించింది. ఏడాదిలో 15టీఎంసీలు తరలించడానికే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ కెనాల్‌ సిస్టం ఏర్పాటు చేయగా ప్రస్తుతం రోజుకు 15 టీఎంసీలు తరలించే సామర్థ్యానికి పెంచుకున్నారని నివేదించింది. చెన్నైకి తాగునీటి అవసరాల కోసం ఏడాదికి 15 టీఎంసీలు అందించడానికి శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై పనులు చేసి, ఏటా 200 టీఎంసీల జలాలను ఏపీ తరలిస్తున్నప్పటికీ ఏడాదికి 15 టీఎంసీల నీటిని కూడా చెన్నైకి తాగునీటి అవసరాల కోసం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.


దీనికోసం శ్రీశైలం లేదా ప్రకాశం బ్యారేజీ నుంచి పైప్‌లైన్‌ వేయాలని, దీనికి అయ్యే వ్యయంలో తమ వాటా భరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ పేర్కొంది. శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు నీటి తరలింపునకు బచావత్‌(కృష్ణా-1) బ్రిజేశ్‌ (కృష్ణా-2) ట్రైబ్యునల్‌లు అనుమతించలేదని నివేదించింది. ఈ సందర్భంగా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా ఏపీ ఏ విధంగా అక్రమంగా నీటిని తరలిస్తుందో దానికి సంబంధించిన మ్యాప్‌ను ట్రైబ్యునల్‌కు సమర్పించింది. ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో టెలిమెట్రీలు పెట్టాలని తాము కోరినా కేంద్రం ఇప్పటిదాకా పెట్టలేదని గుర్తుచేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని షెడ్యూల్‌-11లోని సెక్షన్‌-10పై ఏపీ తప్పుగా అఫిడవిట్‌ దాఖలు చేసిందని, రాజ్యాంగంలోని 262ప్రకారం నీటి కేటాయింపు అధికారం ట్రైబ్యునల్‌కు మాత్రమే ఉందని గుర్తుచేసింది. 1954లో హైదరాబాద్‌, ఆంధ్ర సంయుక్తంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నాగార్జునసాగర్‌ కుడి కాలువ కింద 9.7 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందించాలని ఉండగా ఆ తర్వాత 11.74 లక్షల ఎకరాలకు పెంచారని తెలంగాణ గుర్తు చేసింది.

Updated Date - Aug 29 , 2025 | 04:53 AM