Share News

Mahesh Kumar Goud: అందరికీ తెలంగాణ రోల్‌మోడల్‌

ABN , Publish Date - May 24 , 2025 | 04:55 AM

కులగణనలో దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా కులగణన సర్వే నిర్వహించామని చెప్పారు.

Mahesh Kumar Goud: అందరికీ తెలంగాణ రోల్‌మోడల్‌

  • రాహుల్‌ ఆశయాలకు అనుగుణంగా కులగణన

  • ఏఐసీసీ ముఖ్యల భేటీలో టీపీసీసీ చీఫ్‌

  • ఆ తర్వాత రాహుల్‌తో ప్రత్యేక భేటీ!

న్యూఢిల్లీ, మే 23 (ఆంధ్రజ్యోతి): కులగణనలో దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా కులగణన సర్వే నిర్వహించామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యాలయం(ఇందిరా భవన్‌)లో రాహుల్‌ నేతృత్వంలో ఏఐసీసీ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కులగణనపై మహేశ్‌ గౌడ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సుమారు 2 గంటల పాటు కులగణన జరిపిన తీరును వివరించారు. అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంట్‌కు పంపామని మహేశ్‌ గౌడ్‌ చెప్పారు.


భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ కులగణన హామీనివ్వడంతో బీసీలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే బీసీ కులగణనపై అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సహా మంత్రివర్గమంతా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వేగంగా ప్రత్యేక కార్యాచరణను చేపట్టిందని తెలిపారు. దేశంలోనే తొలిసారి కాంగ్రెస్‌ హయాంలోనే తెలంగాణలో కులగణన జరగడం గర్వంగా ఉందని చెప్పారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తర్వాత రాహుల్‌తో మహేశ్‌ గౌడ్‌ ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలిసింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు సమాచారం.

Updated Date - May 24 , 2025 | 04:55 AM