Share News

CM Revanth Reddy: తెలంగాణలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ

ABN , Publish Date - Sep 20 , 2025 | 05:29 AM

భారతదేశ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు...

CM Revanth Reddy: తెలంగాణలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ

  • అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ నగరం.. దేశ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా నిర్మాణం

  • మొదటి దశలో 30 వేల ఎకరాల్లో 9 జోన్లతో ఏర్పాటు

  • పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరమ్‌ సదస్సులో సీఎం రేవంత్‌ వెల్లడి

  • ప్రపంచ ఆర్థిక సద స్సు అధ్యక్షుడు, న్యూజెర్సీ గవర్నర్‌, పారిశ్రామికవేత్తలతో చర్చలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): భారతదేశ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అది అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రణాళికాబద్ధమైన అత్యుత్తమ నగరంగా విలసిల్లుతుందన్నారు. శుక్రవారం ఢిల్లీలో పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరమ్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మొదటి దశలో 30 వేల ఎకరాల్లో 9 జోన్లలో ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని, ఏఐ సిటీ, హెల్త్‌ జోన్‌, విద్యాజోన్‌ మొదలైనవి ఇందులో ఉంటాయని చెప్పారు. విమానాశ్రయంతో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని అనుసంధానం చేస్తామన్నారు. మచిలీపట్నం ఓడరేవు అనుసంధానానికి ఫ్యూచర్‌ సిటీ నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను, సమాంతరంగా రైల్వేలైన్‌ ను మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. సదస్సులో ఆయన ప్రపంచ ఆర్థిక సదస్సు అధ్యక్షుడు బ్రెండే, న్యూజెర్సీ గవర్నర్‌ మర్ఫీతో సహా పలు కార్పొరేట్‌ సంస్థలు, పరిశ్రమల యజమానులతో కీలక చర్చలు జరిపి.. వారిని రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధికి తోడ్పాటునందించాల్సిందిగా కోరారు. దేశంలో యువ రాష్ట్రమైన తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి విజన్‌-2047ను రూపొందించామని, 2025 డిసెంబరు 9న తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ను వెల్లడిస్తామని అన్నారు. తెలంగాణను కోర్‌ అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ అర్బన్‌గా విభజించామని తెలిపారు. కోటి మందికి పైగా నివసించే కోర్‌ అర్బన్‌ ఏరియాలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తామని, సెమీ అర్బన్‌ ఏరియాను మాన్యుఫ్యాక్చర్‌ రంగానికి కేటాయిస్తామని చెప్పారు.

ట్రంప్‌ నిర్ణయాలతో అమెరికాకే నష్టం..

హైదరాబాద్‌లో ఇప్పటికే 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లకు పొడిగిస్తామని, మూసీ పరివాహక ప్రాంతాన్ని సబర్మతి తీరంలా మారుస్తామని సీఎం రేవంత్‌ అన్నారు. హైదరాబాద్‌ లో ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామని, 2027 నాటికి నగరంలో ఎలక్ర్టిక్‌ వాహనాలే ఎక్కువ ఉండబోతున్నాయని చెప్పారు. బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పత్తిలో, వ్యాక్సిన్ల తయారీలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉన్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాల వల్ల ఆ దేశానికే నష్టమని తెలిపారు. ట్రంప్‌ ఒకరోజు మోదీ తన మిత్రుడు అంటారని, మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారని విమర్శించారు. తెలంగాణలో కూడా ఒక ట్రంప్‌ ఉండేవారని, ఆయనను ప్రజలు పక్కన పెట్టారని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణను 2034 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. కరువు, వరదలతోపాటు పర్యావరణ సంక్షోభాన్ని తట్టుకునే ఏకైక నగరంగా హైదరాబాద్‌ను రూపొందిస్తామన్నారు.


న్యూజెర్సీ గవర్నర్‌తో చర్చలు..

తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేస్తున్న ప్రణాళికలకు తాము పూర్తి మద్దతునిస్తామని న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ అన్నారు. పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరమ్‌ సదస్సు జరుగుతుండగానే ఆయన రేవంత్‌తో కీలక చర్చలు జరిపారు. సాఫ్ట్‌వేర్‌, టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌, పట్టణ రవాణా, సినిమాలు తదితర రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు వారు నిర్ణయించుకున్నారు. తెలంగాణ, న్యూజెర్సీ మధ్య ఎన్నో సామీప్యతలు ఉన్నాయని, రెండు రాష్ట్రాలు పెట్టుబడులు పెంచేందుకు, ఉపాధి కల్పనకు పరస్పరం దోహదం చేసుకోవచ్చని చెప్పారు. ఇరు రాష్ట్రాల అధినేతలు తమ వర్తక ప్రతినిధి వర్గాలను పంపాలని నిర్ణయించుకున్నారు. న్యూజెర్సీ ట్రైన్స్‌ అథారిటీ ద్వారా హైదరాబాద్‌ నగర ప్రజా రవాణా రంగానికి మద్దతునిస్తామని, మెట్రో నుంచి ఎంఎంటీఎస్‌ వరకు తోడ్పడతామని హామీ ఇచ్చారు. కాగా, ప్రిన్స్‌టన్‌, ఎన్‌జేఐటీ వంటి ఉత్తమ విద్యాసంస్థల క్యాంప్‌సలను తెలంగాణలో నెలకొల్పితే తాము పూర్తి మద్దతిస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక సదస్సు అధ్యక్షుడు బోర్జ్‌ బ్రెండేతో పీఏఎ్‌ఫఐ వార్షిక సదస్సులో రేవంత్‌ ముఖాముఖి చర్చలు జరిపారు. గత ఏడాదిగా తెలంగాణలో అసాధారణ అభివృద్ధి జరుగుతోందని, దేశంలో అత్యున్నత విజయాలు సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని రేవంత్‌తో బ్రెండే అన్నారు. వచ్చే ఏడాది దావో్‌సలో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కావాల్సిందిగా రేవంత్‌ను ఆహ్వానించారు.

అమెజాన్‌తోపాటు అనేక సంస్థలు..

తెలంగాణలోనే తన వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తున్న అమెజాన్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిపిన చర్చల్లో మూడు కీలక నిర్ణయాలను ప్రకటించారు. తెలంగాణకు చెందిన చిన్న, మధ్యతరహా సంస్థల అమ్మకందారులకు తమ ఎగుమతుల ప్లాట్‌ఫారంపై అత్యధిక ప్రోత్సాహం కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలు కళాకార్‌ ద్వారా తమ ఉత్పత్తులను అమ్మేందుకు వీలు కల్పిస్తామని, గిగ్‌ వర్కర్లకు వంద రిలాక్సేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా, గోద్రెజ్‌ సంస్థ దాదాపు రూ.200 కోట్లతో కొత్త డైరీ పరిశ్రమను తెలంగాణలో నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. జెర్సీ క్రీమ్‌ బ్రాండ్‌ ఉత్పత్తులు ఈ ప్లాంట్‌లో తయారవుతాయని తెలిపింది.

Updated Date - Sep 20 , 2025 | 05:29 AM